విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్‌పరం చేస్తే ఏపీలో ఒక్క ఎంపీ నోరు మెదపలేదు. విశాఖ ఉక్కును ఇప్పుడు ప్రైవేటీకరించినా తాము జాతీయం చేస్తామని కేంద్రానికి కేసీఆర్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. అందుకే కేసీఆర్‌కు ఉండే ధైర్యం, విజన్ పట్ల ఆంధ్రా ప్రజలు అమిత విశ్వాసంతో ఉన్నారు.
-తోట చంద్రశేఖర్
హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీని ఢీకొట్టే సత్తా బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నదని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. బీజేపీని నిలువరించగల శక్తి, యుక్తి, నాయకత్వ పటిమ తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు ఉన్నదని పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్ రోజురోజుకూ కుంచించుకుపోతున్నదని, ఆ పార్టీ తిరిగి జాతీయ రాజకీయాలపై ప్రభావం చూసే అవకాశం లేదని అన్నారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలపై సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉన్నదని తెలిపారు.
భావసారుప్యత గల నాయకులు, పార్టీలతో ఆయన చర్చలు జరుపుతున్నారని వివరించారు. దేశానికి కేసీఆర్ చారిత్రక అవసరమని తెలిపారు. దేశంలో గుణాత్మక మార్పునకు అవసరమైన బ్లూప్రింట్ కేసీఆర్ వద్ద ఉన్నదని వెల్లడించారు. తనను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించిన పార్టీ అధినేత కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రశేఖర్ బుధవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో దేశంలో జరగబోయే మార్పు లో తనకూ అవకాశం కల్పించారని, అంతటి మహా నాయకుడితో కలిసి పనిచేసే అదృష్టం దక్కినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. దేశం బాగుపడాలన్న బలమైన ఆకాంక్ష కేసీఆర్‌లో ఉన్నదని అన్నారు. తెలంగాణను సాధిం చి, ఆదర్శంగా తీర్చిదిద్దిన స్ఫూర్తితో దేశాన్ని మారుస్తారనే విశ్వాసం ఉన్నదని వెల్లడించారు.
కేసీఆర్‌కు సరితూగే నేత దక్షిణాదిలో లేరు
దక్షిణభారతంలో కేసీఆర్‌తో సరితూగే నాయకుడు ఎవరూ లేరని తోట చంద్రశేఖర్ తెలిపారు. కేసీఆర్ వంటి పరిపాలనా దక్షత, అనుభవం, పరిపక్వత ఉన్న నాయకుడిని ఇంతవరకు చూడలేదని పేర్కొన్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర.. తదితర ఏ రాష్ట్రంలోనూ కేసీఆర్ వంటి నేత లేరన్నది నగ్న సత్యమని అన్నారు. కేసీఆర్ తెలుగు రాష్ర్టాల్లో ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమని చెప్పారు. దేశం ఎదుర్కొంటున్న ప్రతీ సమస్యపైనా కేసీఆర్ దగ్గర స్పష్టమైన సమాధానం ఉన్నదని తెలిపారు. తెలంగాణ సాధించిన తరువాత కేసీఆర్ విశ్రాంతి తీసుకోవచ్చని, అవసరం అనుకుంటే రిటైర్ కూడా కావచ్చు.. కానీ తెలంగాణ కలను సాకారం చేసిన స్ఫూర్తితో ఇవ్వాళ దేశం బాగు పడాలని కల కంటున్నారని ప్రశంసించారు.
తాత్కాలిక ప్రయోజనాల కోసం చేరలేదు
తాత్కాలిక ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరలేదని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఏపీ రాజకీయాలను సంకుచిత దృష్టితో చూడటం లేదని, జాతీయ దృక్పథంతో చూశానని అన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రజల శక్తిగా ముందుకు కదిలారని తెలిపారు. కేసీఆర్‌తో ప్రయాణం తనకు మంచి అనుభవాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
ఏపీలో సంకుచిత రాజకీయాలకు చెక్
ఏపీలో ప్రస్తుతం సంకుచిత కుల రాజకీయాలు నడుస్తున్నాయని తోట చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణతో పోలిస్తే ఏపీ అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని అన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు ఇద్దరికీ రాష్ర్టాన్ని ఎలా బాగు చేయాలనే విజనే లేదని ఆరోపించారు. ఎన్నికలు పూర్తికాగానే, పాలనపై దృష్టిపెట్టాల్సిందిపోయి తిరిగి ఎన్నికల్లో ఎలా గెలవాలని ఆలోచిస్తుండటంతో ఏపీ అన్ని విషయాల్లో తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానని, మూడు రాజధానులు నిర్మిస్తామని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. ఏపీ ప్రజలు చైతన్యవంతులని, వారి రాజకీయాలను అర్థం చేసుకొన్నారని చెప్పారు. తెలంగాణలో అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి జరిగిందనే విషయాన్ని ఏపీ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలోనూ తెలంగాణ మాడల్ అభివృద్ధి జరగాలన్న ఆశతో కేసీఆర్ కోసం ఏపీ ఎదురుచూస్తున్నదని తెలిపారు.
బీఆర్ఎస్ రోడ్‌మ్యాప్
ఏ పార్టీ అయినా చిన్న పార్టీగానే ప్రారంభమవుతుందని తోట చంద్రశేఖర్ చెప్పారు. రెండు సీట్లతో మొదలైన బీజేపీ నేడు దేశాన్ని పాలిస్తున్నదని, ఢిల్లీలో మొదలై ఆప్ పార్టీ పంజాబ్ వరకు విస్తరించిందని గుర్తుచేశారు. రేపు బీఆర్ఎస్ కూడా అంతే అని ఆశాభావం వ్యక్తంచేశారు. తెలంగాణను బాగు చేసిన స్ఫూర్తితో దేశాన్ని బాగుచేయాలని కేసీఆర్ బయలుదేరారని, ఆ విజన్ చూసి తాను బీఆర్ఎస్ పట్ల ఆకర్షితుడినయ్యానని అన్నారు.
సంక్రాంతి తరువాత ఏపీలో సమావేశం
ఏపీలో బీఆర్ఎస్ నిర్మాణం పటిష్ఠంగా చేపడతామని చంద్రశేఖర్ చెప్పారు. తాను బీఆర్ఎస్లో చేరగానే ప్రజల దగ్గరి నుంచి విశేష ఆదరణ వచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు ఏపీలో జిల్లాల్లో పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టారని తెలిపారు. సంక్రాంతి తరువాత రాష్ట్రంలో సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని వెల్లడించారు.
విభజన సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు
ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం విషయంలో బీఆర్ఎస్కు స్పష్టమైన అవగాహన ఉన్నదని తోట చంద్రశేఖర్ చెప్పారు. సీఎం కేసీఆర్‌తో దాదాపు ఏడెనిమిది గంటలపాటు అన్ని విషయాలపై సుదీర్ఘంగా చర్చించామని, కేసీఆర్‌కు ఉన్న విజన్‌తో విభజన సమస్యల పరిష్కారం పెద్ద విషయం కాదని అర్థమైందని పేర్కొన్నారు. ‘నాకు తెలిసి ఈ దేశంలో పార్టీలు కాదు.. ప్రజలు గెలవాలన్న ఆకాంక్షను వెల్లడించిన మొదటి నాయకుడు కేసీఆర్. తెలంగాణ సా ధించిన నాయకుడిగా.. ఆ రాష్ర్టాన్ని ప్రపంచం మెచ్చేలా తీర్చిదిద్దిన పాలకుడిగా.. కేసీఆర్ విభజన సమస్యలపై అద్భుతమైన ఆలోచనా విధానంతో ఉన్నారు’ అని పేర్కొన్నారు.
దేశం తెలంగాణ మాడల్‌ను కోరుతున్నది
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, ఇప్పుడు తెలంగాణ మాడల్‌ను దేశం కోరుకొంటున్నదని చెప్పారు. తెలంగాణ మాడల్‌ను కోరుకుంటున్నదంటే తెలంగాణ నాయకత్వాన్ని కోరుకొంటున్నదని అర్థం చేసుకోవాలని అన్నారు. కేసీఆర్ ఆనాడు తెలంగాణ కోసం ఎంతగా పరితపించారో.. ఇవ్వాళ దేశం కోసం అలాగే ముందుకు సాగుతున్నారని తెలిపారు. ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో రైతుల సమస్యల పరిష్కారమే ఎజెండాగా బీఆర్ఎస్ నిలబడిందని అన్నారు.
తెలంగాణలో అభివృద్ధి విప్లవం
తెలంగాణలో అభివృద్ధి విప్లవం జరుగుతుంటే ఏపీలో నిరాశ వెంటాడుతున్నదని చంద్రశేఖర్ అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ.. ఇలా తెలంగాణ నిత్య శోభితంగా మారిందని కొనియాడారు. ఇరు రాష్ర్టాల ప్రజలు ప్రతీ రోజూ కలుస్తుంటారని, వారికి పోలికపై ప్రత్యేకంగా ఉదహరించాల్సిన పనిలేదని పేర్కొన్నారు.
విశాఖ ఉక్కుపై కేసీఆర్ ప్రకటన చాలు
విశాఖ ఉక్కు-ఆంధ్ర హక్కు అని ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేస్తే ఏపీలోని ఒక్క ఎంపీ నోరు మెదపలేదని తోట చంద్రశేఖర్ విమర్శించారు. దీనిపై కేసీఆర్ కేంద్రానికి స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారని, విశాఖ ఉక్కును ఇప్పుడు ప్రైవేటీకరించినా తాము జాతీయం చేస్తామని చెప్పి న తరువాత కేసీఆర్‌కు ఉండే ధైర్యం, విజన్‌పై ఆంధ్రా ప్రజలు విశ్వాసంతో ఉన్నారని వివరించారు. ఏపీలో తమ కు బలం లేదని, బలగం లేదని హేళన చేసేవారిని తాము పట్టించుకోబోమని తెలిపారు. కష్టాలు, కన్నీళ్లతో కాలం గడుపుతున్న ప్రజల కోసం పనిచేస్తామని తెలిపారు. ‘ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలను ఎలా పరిష్కరించాలి? అన్నదానిపైనే మా దృష్టి ఉంటుంది.