BRS | హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మిలాఖత్ అయ్యాయా? ఒక పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నచోట మరో పార్టీ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టి పరోక్షంగా సహకరిస్తున్నదా? పోలింగ్ రోజు రెండు పార్టీల ఓట్లు ఒకే అభ్యర్థికి పడేలా లోపాయకారీ ఒప్పందాలు జరిగిపోయాయా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. శుక్రవారంతో ముగిసిన నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన తర్వాత రాజకీయ విశ్లేషకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు ఒంటరిగా తమ శక్తి సరిపోదని బీజేపీ, కాంగ్రెస్‌కు ముందు నుంచీ తెలుసని అంటున్నారు. సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రజాకర్షణ, సంక్షేమ పథకాలు, పదేండ్లలో జరిగిన అభివృద్ధి వంటి అనేక సానుకూల అంశాలు బీఆర్ఎస్కు ఉన్నాయని, అందుకే ఆ పార్టీని ఢీ కొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని చెప్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్లో పొన్నం ప్రభాకర్, నిజామాబాద్‌లో మధుయాష్కీగౌడ్ బీజేపీ అభ్యర్థులకు సహకరించిన వైనాన్ని గుర్తుచేస్తున్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు అదే తరహాలో లోపాయికారీ ఒప్పందాలు, పరస్పర ప్రయోజనాలనే నమ్ముకున్నాయని అభిప్రాయపడుతున్నారు.
ఎన్నో ఉదాహరణలు
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ బంధం కొత్తదేమీ కాదని, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లోనూ మిలాఖత్ అయ్యాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ను బరిలో దిగగా, నియోజకవర్గ ప్రజలకు పరిచయం లేని బల్మూరి వెంకట్‌కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు సంపూర్ణంగా బీజేపీ వైపు మళ్లిందని విశ్లేషిస్తున్నారు. మునుగోడులోనూ పాల్వాయి స్రవంతికి టికెట్ ఇచ్చి బీజేపీకి సహకరించారని చెప్తున్నారు. ఈ సారి కూడా కూడా బలమైన అభ్యర్థులపై బలహీనులను నిలబెట్టారని విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే హుజూరాబాద్‌లో ఈటలపై కాంగ్రెస్ తరఫున వొడితెల ప్రణవ్‌కు టిక్కెట్ ఇచ్చారని చెప్తున్నారు. కోరుట్లలో కాంగ్రెస్ తరఫున నర్సింగరావును నిలబెట్టడం కూడా ఇలాంటిదేనని అంటున్నారు. నర్సంపేటలో బీజేపీ నుంచి కే పుల్లారావుకు టికెట్ ఇవ్వడం, పాలకుర్తిలో లేగ రాంమోహన్‌రెడ్డిని బరిలో దించడం కూడా రహస్యపొత్తులో భాగమనే విమర్శ ఉన్నది.
చెన్నూరులో కాంగ్రెస్ నేత వివేక్‌కు మేలు చేసేందుకు బీజేపీ దుర్గం అశోక్‌కు టికెట్ ఇచ్చిందని, బోధన్‌లో మోహన్‌రెడ్డికి, ఆర్మూర్‌లో పైడి రాకేశ్‌రెడ్డికి బీజేపీ టికెట్లు ఇవ్వడం ఒప్పందంలో భాగమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముషీరాబాద్ నుంచి దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి బీజేపీ నుంచి బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి అంజన్‌కుమార్‌యాదవ్‌కు సహకరించేందుకే పూసరాజు అనే వ్యక్తికి బీజేపీ టికెట్ ఇచ్చారని ఆ పార్టీ శ్రేణులే ఆరోపిస్తున్నాయి. అంబర్‌పేట కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న మొగిలి సునీతారావుకు గోషామహల్ టికెట్ ఇచ్చారని భావిస్తున్నారు. కంటోన్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి, గద్దర్ కూతురు వెన్నెలకు సహకరించేందుకే బీజేపీ నాన్ లోకల్ అభ్యర్థికి టికెట్ ఇచ్చిందని, కూకట్‌పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేశ్‌కు సహకరించేందుకు ఏకంగా జనసేనకు కేటాయించారనే ఆరోపణలున్నాయి. మేడ్చల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేశ్‌యాదవ్ కోసం బీజేపీ ప్యారాచూట్ నాయకుడికి టికెట్ ఇచ్చిందని, నాంపల్లిలోనూ ఇలాంటి ఒప్పందమే జరిగిందని అంటున్నారు. వీటన్నింటిని బట్టి రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పరస్పరం లోపాయకారీ ఒప్పందాలు జరిగిపోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
పోటీకి దూరంగా బలమైన నేతలు
అంబర్‌పేట నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పోటీ చేయాల్సి ఉన్నది. ఎంపీలందరూ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయాలని అధిష్ఠానం ఆదేశించింది. కానీ, కిషన్‌రెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. అక్కడి నుంచి ఆయన భార్య పోటీచేస్తారని ప్రచా రం జరిగింది. కానీ కృష్ణాయాదవ్‌కు టికెట్ కేటాయించారు. కాంగ్రెస్ అభ్యర్థి రోహిణ్‌రెడ్డి కోసమే కిషన్‌రెడ్డి ఇలా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు గద్వాలలో బలమైన నేత డీకే అరుణ బీజేపీ తరఫున బరిలోకి దిగలేదు. చివరి క్షణంలో బోయ శివకు టికెట్ ఇప్పించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేందు కే అరుణ తప్పుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డికి అనుకూలించేలా బీజేపీ నుంచి భోగ శ్రావణిని బరిలో దింపారని అంటున్నారు. కోరుట్లలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండే ఒక సామాజికవర్గం నేతలు బీజేపీకి సహకరించేలా, జగిత్యాలలో బీజేపీకి అనుకూలంగా ఉండే సామాజికవర్గం కాంగ్రెస్‌కు సహకరించేలా తీర్మానాలు చేయించినట్టు తెలుస్తున్నది.