Congress | హైదరాబాద్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ): గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో విస్తృతంగా పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ఇప్పుడు తెలంగాణకు వచ్చేందుకు ముఖం చాటేస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీతో ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించాలని, ఇందులో భాగంగా ఈ నెల 19 నుంచి డిసెంబర్ 9వ తేదీలోగా మూడు భారీ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం నిర్ణయించాయి. ఈ నెల 19న వరంగల్‌లో ఇందిరాశక్తి పేరుతో మహిళల సభ, ఈ నెల 25న యూత్ కోసం కరీంనగర్లో రెండో సభ, ఈ నెల 30న రైతుల కోసం మహబూబ్‌నగర్‌లో మూడో సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో ఏ ఒక్క సభకు కూడా రాహుల్‌గాంధీ గానీ, ప్రియాంకగాంధీ గానీ రావడం లేదని తెలిసింది. ఆయా సభలకు రావాల్సిందిగా రాష్ట్ర పార్టీ ముఖ్యులు ఆహ్వానించినప్పటికీ వారు అంగీకరించలేదని తెలిసింది.
విజయోత్సవ సభలకు పార్టీ పెద్దలు ముఖం చాటేస్తుండటంపై పార్టీలో పెద్ద చర్చ జరుగుతున్నది. కేవలం ఏడాదిలోనే రేవంత్ సర్కార్ ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్నదనే సమాచారం అధిష్ఠానానికి చేరిందని, అందుకే విజయోత్సవాలకు వచ్చేందుకు వెనకంజ వేస్తున్నారనే చర్చ సాగుతున్నది. దీంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందనే నివేదికలు ఇప్పటికే సొంత పార్టీ నేతలే అధిష్ఠానానికి చేరవేసినట్టు ప్రచారం జరుగుతున్నది.
రైతులకు రైతుభరోసా ఇవ్వకపోవడం, రుణమాఫీ సరిగ్గా చేయకపోవడం, ధాన్యం కొనుగోలు సక్రమంగా చేయకపోవడం, దళితబంధు నిలిపేయడం, తులం బంగారం హామీని అమలు చేయకపోవడం, పెన్షన్లు పెంచకపోవడం, మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామన్న హామీని విస్మరించడం వంటివి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెంచుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకు రావడం అంత శ్రేయస్కరం కాదనే అభిప్రాయం ఢిల్లీ పెద్దల్లో ఉన్నదని కాంగ్రెస్ చర్చించుకుంటున్నారు. రేవంత్ సర్కారు పనితీరుపై అధిష్ఠానం పెద్దలు కూడా అసంతృప్తిగానే ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. అం దుకే విజయోత్సవాల సభలకు దూరంగా ఉండాలని పార్టీ పెద్దలు నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నది.