Group-1 Mains | హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఎన్నో వివాదాలకు మూలంగా మారిన గ్రూప్-1 మెయిన్స్ మళ్లీ తప్పదా..? కొత్త సెలెక్షన్ చేయాల్సిందేనా..! అంటే నిరుద్యోగులు అవుననే అంటున్నారు. జీవో-29 కోర్టులో నిలబడదని, పైగా సుప్రీంకోర్టు తీర్పు సైతం నోటిఫికేషన్‌పై ప్రభావితం చూపుతుందని అభ్యర్థులు అంటున్నారు. మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాల్లో ప్రిలిమ్స్‌లోనూ రిజర్వేషన్లను వర్తింపజేయాలన్న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును మన దగ్గర అమలుచేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే గ్రూప్-1 పరీక్షలను మళ్లీ నిర్వహించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే మెయిన్స్ రాసిన అభ్యర్థులను ప్రభుత్వం రెచ్చగొడుతుందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
నార్మలైజేషన్ అంటూ కొత్త పల్లవి
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పట్టుదలకు పోయింది. అభ్యర్థులు వాయిదావేయమని ఎంత మొత్తుకున్నా వినకుండా పరీక్షలను నిర్వహించింది. హైకోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాతే ఫలితాలు ప్రకటించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఇటీవలే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రాసిన వారు కొత్త పల్లవి అందుకున్నారు. టీజీపీఎస్సీకి ఓ లేఖ రాశారు. ‘ఒక వేళ కోర్టు కేసులతో గ్రూప్-1 మెయిన్స్‌ను మళ్లీ నిర్వహించాల్సి వస్తే తాము మళ్లీ రాయలేం. మళ్లీ పరీక్షను నిర్వహిస్తే తమను మినహాయించి కొత్తగా 1:50 రేషియోలో ఎంపికైన వారికే మళ్లీ పరీక్షను నిర్వహించాలని, నార్మలైజేషన్‌ను చేపట్టాలి’ అంటూ లేఖను సంధించారు.
మళ్లీ మెయిన్స్‌ను నిర్వహిస్తారనేందుకు ఇదే తార్కాణమంటున్నారు. కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తుందని గ్రహించి, ప్రభుత్వం సొంత వ్యక్తులతో ఇలా లేఖలు రాయిస్తున్నదని అభ్యర్థులు మండిపడుతున్నారు. దీని వెనుక కుట్ర దాగిఉందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిగిందని వాపోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు గ్రూప్-1 పోస్టులను అమ్మకున్నారని, మళ్లీ పరీక్ష నిర్వహిస్తే ఇప్పుడు ఎంపికైన వారు పోటీలో ఉండరని, దీంతోనే కొత్త కుట్రలకు పాల్పడుతున్నారని నిరుద్యోగి జనార్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు లేఖలు రాసినవారంతా గ్రూప్-1 పరీక్షతో సంబంధంలేని వారేనని, ఇలాంటి వారితో కుట్రలు చేయడం దారుణమని మరో అభ్యర్థి శివ మండిపడ్డారు.