Congress | హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ఎవరా ఇద్దరు? రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇప్పుడు ఇదే చర్చ. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో సోమ, మంగళవారాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో జరిగిన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో సీనియర్ల ఎత్తులకు పార్టీ అడ్డుకట్ట వేస్తుందని భావించినా.. రేవంత్‌రెడ్డిని ఒంటరి చేసిందని ఆయన వ్యతిరేకవర్గం సంబురపడుతున్నది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ‘ఇద్దరిని పార్టీ నుంచి తీసేస్తే అంతా సెట్ అవుతుంది’ అని రాహుల్ వ్యాఖ్యానించడం రేవంత్ అనుకూల, వ్యతిరేక వర్గాల్లో కలకలం రేపుతున్నది.
తుస్సుమన్న ఖమ్మం ‘పొంగు’
ఖమ్మంలో ఉప్పెన సృష్టిస్తామని ఐదారు నెలలుగా ఊదరగొట్టిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యవహారం ఆఖరికి తుస్సుమంది. పొంగులేటి చివరకు కాంగ్రెస్‌లో చేరతానని నిర్ణయం తీసుకొని లక్షలాదిమందితో సభ పెడతానని, తన ఏంటో చూపిస్తామని భావించినా.. ఆయనకు ఆదిలోనే హంసపాదు అన్నట్టు చేదు అనుభవం ఎదురైంది. జూలై 2న లక్షలాది మంది సమక్షంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరతానని, ఆ సభకు రాహుల్‌గాంధీ రావాలని పొంగులేటి షరతు పెట్టారు. అలాగే.. అని ఆయనను పార్టీ నేతలు ‘ఢిల్లీలో రాహుల్‌గాంధీ’ ముందు ప్రవేశపెట్టారు. అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. దీంతో ఏర్పాట్లలో తలమునకయ్యారు. ఇంతలో భట్టి భుజం మీద తుపాకీ పెట్టి రేవంత్‌ను కాల్చాలనుకున్న సీనియర్లు.. భట్టి విక్రమార్క 100 రోజులపాదయాత్ర ముగింపు కూడా అదే రోజున (జూలై 2న) ఉందని, భట్టికి అభినందన పెట్టాలని రాహుల్‌ను ఆహ్వానించారు. రెండు వేర్వేరుగా ఎందుకు ఒకేచోట చేద్దాం, భట్టి అభినందన సభలోనే పొంగులేటికి కండువా కప్పుదాం’ అని పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నది. ఇక్కడా రేవంత్పాచిక పారలేదు. సీనియర్లదే పైచేయి అయింది. భట్టి అభినందన సభ రూపంలో పొంగులేటి చేరికకు పార్టీ అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని తేలిపోయింది.
రేవంత్ కథ ముగిసిందా?
రాష్ట్ర కాంగ్రెస్‌లో రేవంత్ కథ ముగిసిందా? అంటే ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం సాక్షిగా జరిగిన సమావేశం, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేచి ఏదో చెప్పబోతుండగా.. ‘అంతా నాకు తెలుసు ’ అని ఆయనను రాహుల్‌గాంధీ వారిస్తూనే.. మరోవైపు రేవంత్ వంక చూస్తూ ‘అందరినీ కలుపుకొని’ పోవాలని అన్నట్టు చూసేసరికి రేవంత్ మొహం వాడిపోయిందని పార్టీ సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారు. సమావేశానంతరం రేవంత్‌రెడ్డి వ్యతిరేకవర్గ సభ్యుడిగా ముద్రపడిన జగ్గారెడ్డి భుజంపై రాహుల్ చేయి వేసి నవ్వుతూ నడుచుకుంటూ వెళ్లారు. సమావేశంలో రాహుల్‌గాంధీ రేవంత్‌కు అసలు ప్రాధాన్యం ఇవ్వకుండా సీనియర్లతోనే చర్చించినట్లు తెలిసింది. రేవంత్‌ను ఏదో మూలకు విసిరేసినట్టుగా వెనకాల నిలుచునేలా చేయడం వంటి పరిణామాలను బట్టిపార్టీలో ఆయన పని అయిపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.