కరీంనగర్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ)/కలెక్టరేట్: ‘తెలంగాణ సీఎం కేసీఆర్ భవిష్యత్తులో భారత ప్రధాని కావటం తథ్యం’ అని పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌ప్రదేశ్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో వెల్లడించారు. తెలంగాణలో పాలన అద్భుతంగా ఉన్నదని, ఈ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా ఉన్నదని తెలిపారు. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు తాయ్ తడాప్, టెకీ కామా, బిరిజాయ్, దెబీయా తారా, చావ్ షోటికే హొపాక్, పీకే పులు తదితరులు తెలంగాణ అభివృద్ధిని పరిశీలించేందుకు వచ్చారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం బీసీ సంక్షేమ, పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వినోద్‌కుమార్ నివాసంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి దేశ ప్రజలను ఆకర్షిస్తున్నదని, అందుకే తాము బీఆర్ఎస్లో చేరాలనుకుంటున్నట్టు తెలిపారు. దేశాన్ని పాలించే సత్తా కేసీఆర్‌కే ఉన్నదని స్పష్టం చేశారు. 2024 ఏప్రిల్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తామని తెలిపారు. మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ సీట్లు బీఆర్ఎస్కు అందించి, కొత్త చరిత్ర సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి అనేక సమస్యలతో సతమతమవుతున్న అరుణాచల్‌ప్రదేశ్ ప్రజలను కాంగ్రెస్, బీజేపీ మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో అధికార బీజేపీ ఆగడాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ తన పాత్రను పోషించటం లేదని విమర్శించారు. ఈ తరుణంలో కారుచీకటిలో కాంతిరేఖలా బీఆర్ఎస్ కనిపిస్తున్నదని కొనియాడారు.
ఈశాన్య రాష్ర్టాల్లో అత్యంత వెనుకబాటుకు గురైన అరుణాచల్‌ప్రదేశ్.. తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటే అనతికాలంలోనే అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. దశాబ్దాల పాలనతో దేశాన్ని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్, బీజేపీ పాలనకు చరమగీతం పాడుతూ, అభివృద్ధిని సాక్షాత్కరింపజేయటమే బీఆర్ఎస్ ఆలోచన విధానం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. నిరంతర అభివృద్ధితో తెలంగాణ ఆదర్శంగా మారిందని, దీన్ని గుర్తించి ఇతర రాష్ర్టాల్లోని ప్రజలు బీఆర్ఎస్ను ఆహ్వానిస్తున్నారని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని, ఆ రాష్ర్టాల్లో పోటీ చేసే అభ్యర్థులపై దృష్టి సారించనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా కరీంనగర్లో జరిగిన అభివృద్ధిని పరిశీలించిన బృందం.. చాలా బాగా అభివృద్ధి చేశారని మంత్రి గంగుల కమలాకర్‌ను అభినందించింది. కేసీఆర్ రాష్ట్రంలో గొప్ప పాలన అందిస్తున్నారని కొనియాడింది. అనంతరం అరుణాచల్‌ప్రదేశ్ మాజీ ఎమ్మెల్యేల బృందాన్ని గంగుల సన్మానించారు.