హైదరాబాద్, మే 14(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల 60 ఏండ్ల ఆకాంక్ష నెరవేరి పదేండ్లు పూర్తవుతున్న సందర్భాన్ని ఎంతో గొప్పగా జరుపుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది వేడుకలపై మౌనం దాల్చింది. మరో పక్షం రోజుల్లో పదేండ్లు పూర్తవుతున్నా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకల నిర్వహణకు ఎటువంటి చర్యలూ తీసుకున్న దాఖలాలు లేవు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ప్రజల చిరకాల స్వప్నం సాకారమైన సందర్భం కాబట్టి ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకొని వేడుకలు నిర్వహించే అవకాశమున్నా, ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఏమాత్రమూ ప్రయత్నించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. జూన్ 1తో దేశంలో ఎన్నికల హడావుడి ముగుస్తుంది. కాబట్టి వేడుకల నిర్వహణకు ఎన్నికల కమిషన్ అభ్యంతరం చెప్పకపోవచ్చు.
నిరుడు 21 రోజులపాటు ఉత్సవాలు
కేసీఆర్ నేతృత్వంలో జరిగిన మలిదశ ఉద్యమంతో 2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. వచ్చే జూన్ 2తో రాష్ట్రం ఏర్పడి సరిగ్గా పదేండ్లు పూర్తవుతుంది. రాష్ట్ర ఏర్పాటు తరువాత తొమ్మిదిన్నరేండ్లపాటు కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అనేక రంగాల్లో నంబర్-1 స్థానానికి ఎదిగింది. వ్యవసాయం, నీటి పాదరుల, పరిశ్రమలు, విద్యం, వైద్యం తదితర రంగాల్లో పెద్ద రాష్ర్టాలను సైతం వెనక్కి నెట్టేసింది. రాష్ట్రం ఏర్పడి 9 ఏండ్లు పూర్తయి పదో ఏటలోకి అడుగుపెట్టిన సందర్భంగా కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది జూన్ 2 నుంచి 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సంగీత విభావరి, సినిమా, జానపద కళాకారులతో ప్రదర్శనలు, సంగీతం, నృత్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. జూన్ 2న జాతీయ జెండా ఆవిష్కరణతో ప్రారంభమైన ఉత్సవాలు 22న అమరుల సంస్మరణతో ముగిశాయి. తెలంగాణ అమరుల స్మారకం ప్రారంభోత్సవంలో భాగంగా జూన్ 22న అప్పటి సీఎం కేసీఆర్ మొదట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, నిత్యజ్వలిత దీప్తి అమరజ్యోతిని వెలిగించారు. తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని నలుదిశలా చాటేలా పండుగ వాతావరణంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి రాజధాని హైదరాబాద్ వరకు ఈ ఉత్సవాలు నిర్వహించారు. వేడుకల నిర్వహణకు ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని, తెలంగాణ ఆస్థిత్వాన్ని ప్రతిబింబించేలా ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల లోగోను కూడా ఆవిష్కరించింది.
పోరాట యోధులను స్మరించుకోరా?
జూన్ 2తో రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తికానున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణవాదులు కోరుతున్నారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించి పోరాట యోధులను సత్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఘనకీర్తిని నలుదిశలా వ్యాపింపజేసే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తికావడం, ఇక్కడ నిర్వహించే వేడుకలు ఇతర రాష్ర్టాల్లోని ఎన్నికలపై ఎటువంటి ప్రభావమూ చూపే అవకాశం లేకపోవడంతో అడిగితే ఎన్నికల కమిషన్ కూడా అనుమతినిస్తుందని చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.