(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సమయంలో విడుదల చేసిన ఎలక్టోరల్ బాండ్ల సాయంతో బీజేపీ భారీగా లబ్ధి పొందింది. ఎలక్టోరల్ బాండ్ల 23వ దఫాలో రూ.676.26 కోట్ల బాండ్లు అమ్ముడుపోగా, అందులో 97.6 శాతం (రూ.660 కోట్లు) వివిధ రాజకీయ పార్టీలు న్యూఢిల్లీలోని ఎస్బీఐ ప్రధాన బ్రాంచీలోనే ఎన్‌క్యాష్ చేసుకొన్నాయి. ఈ నిధుల్లో 85 శాతం బీజేపీకే అందినట్టు అంచనా. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా సామాజిక కార్యకర్త, రిటైర్డ్ కమోడోర్ లోకేశ్ కే బాత్రా అడిగిన ఓ ప్రశ్నకు ఈ మేరకు ఎస్బీఐ వివరాలు వెల్లడించింది.
2018 నుంచి ఇప్పటి వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వివిధ రాజకీయ పార్టీలకు లభించిన నిధుల మొత్తం రూ.11,467 కోట్లు. అయితే సరిగ్గా గుజరాత్ ఎన్నికల ముందే కేంద్రం నవంబర్ 11 నుంచి 15 వరకు 23వ దఫా ఎలక్టోరల్ బాండ్ల అమ్మకానికి అనుమతించింది. గుజరాత్లో రెండో దశ పోలింగ్ (ఈ నెల డిసెంబర్ 5న) జరుగుతుండగానే 24వ దఫా ఎలక్టోరల్ బాండ్ల అమ్మకానికి (డిసెంబర్ 3 నుంచి 18 వరకు) మరో 15 రోజులు అనుమతిని పొడిగించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-2017లోని నిబంధనల ప్రకారం సార్వత్రిక ఎన్నికల్లో లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం ఒక శాతం ఓట్లు పొందిన రాజకీయ పార్టీలు మాత్రమే ఎలక్టరోల్ బాండ్ల ద్వారా నిధులు పొందే అర్హత ఉన్నది. ఈ నిబంధన ప్రకారం ప్రస్తుతం దేశంలోని 25 రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్లతో నిధులు పొందుతున్నాయి.