హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కార్యాలయంలో ప్రధాని మోదీ ఫొటో ఉన్నదా? అని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ ప్రశ్నించారు. సిరిసిల్లలో కేటీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని సోమవారం ఒక ప్రకటనలో ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలోని 8మంది కాంగ్రెస్ ఎంపీలు కూడా ప్రధాని మోదీ ఫొటో పెట్టుకున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అసమర్థతను కేటీఆర్ గట్టిగా ప్రశ్నిస్తున్నారని.. సీఎం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదని విమర్శించారు.
తెలంగాణకు ‘నై’ అన్న రేవంత్‌రెడ్డి ఫొటో కోసం కాంగ్రెస్ నేతలు ఇంత హడావుడి చేయడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణను సాధించిన కేసీఆర్ ఫొటోను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గూండాలు వచ్చి క్యాంపు కార్యాలయంపై దాడులు చేస్తే, పోలీసులేమో బీఆర్ఎస్ నేతలపై లాఠీచార్జి చేసి అరెస్టు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.