హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : ‘ఇప్పుడు ఆలోచన చేసి.. ఓ మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోతే.. తెలంగాణను మళ్లీ కుక్కలు చింపిన విస్తరి చేస్తారు. శాంతిభద్రతలు అదుపు తప్పుతాయి. రౌడీ మూకలు రాజ్యమేలుతాయి’ అని ఎన్నికల సమయంలో కేసీఆర్ చెప్పిన మాటలు నేడు అక్షర సత్యంగా కనిపిస్తున్నాయి. పది నెలల పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పడంతో ఓ డీజీపీ, హైదరాబాద్కు ఇద్దరు సీపీ లు మారాల్సి వచ్చింది. అయినా.. మళ్లీ తెలంగాణలో లా అండ్ ఆర్డర్ నిజంగా ఆర్డర్లోనే ఉన్నదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఆందోళనలు, నిరసనలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు ‘పోలీస్ యాక్ట్’ను ప్రయోగిస్తున్నది. అనుమతి లేకుండా ధర్నా లు, ర్యాలీలు, ఆందోళనలు, నిరసనలు, సభ లు, సమావేశాలు, పబ్లిక్ మీటింగులు, రాస్తారోకోలు చేస్తే చర్యలు తీసుకుంటామని పో లీసులు హెచ్చరిస్తున్నారు. సిద్దిపేట కమిషనరే ట్, మెదక్ జిల్లా, నిర్మల్ జిల్లా, సంగారెడ్డి వం టి పలు జిల్లాల్లో పోలీసు యాక్ట్ అమల్లో ఉన్న ది. ప్రజా ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఫరిఢవిల్లుతున్నదని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎక్కడికక్కడ ప్రజల హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని బుల్డోజర్లతో ఖూనీ చేస్తున్నదని పౌరసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపక్ష నేతలకు భద్రత కరువు
ఓవైపు పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నదని చెప్తూనే ప్రతిపక్ష నేతల పరామర్శల కార్యక్రమానికి పోలీసులు రక్షణ కల్పించలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎక్కడో ఓ చోట కాంగ్రెస్ కార్యకర్తల దౌ ర్జన్యం కనిపిస్తూనే ఉన్నది. శాంతిభద్రతలను పోలీసులే గాలికి వదిలేస్తుంటే.. డీజీపీ, ఏడీజీ ఏం చేస్తున్నారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.