కరీంనగర్ కార్పొరేషన్, జూలై 16: నాలుగు రోజుల్లోగా సాగునీరు ఇవ్వాలని, లేదంటే భారీఎత్తున ధర్నా చేస్తామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హెచ్చరించారు. బుధవారం కొత్తపల్లి కెనాల్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి క్రికెట్ ఆడి ప్రభుత్వాని కి నిరసన వ్యక్తంచేశారు. అనంతరం చొప్పదండి నియోజకవర్గంలో సాగునీటి సమస్యలపై కరీంనగర్లో కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ప్రాజెక్టులను నింపి ప్రతి ఎకరాకు నీరందించారని తెలిపారు.
నదుల్లో నీరున్నా సాగునీరు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం అధికారంలో ఉన్నదని విమర్శించారు. నారుమడులకు నీళ్లు లేక ట్యాంకర్ల ద్వారా పోసుకునే దుస్థితి నెలకొన్నదని వాపోయారు. ప్రభుత్వానికి సోయి లేకపోవటం వల్లే కాళేశ్వరం వద్ద ప్రస్తుతం 98వేల క్యూసెక్కుల వరదనీరు వృథాగా పోతున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏనుగు రవీందర్‌రెడ్డి, పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, గడ్డం చుక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు.