రాష్ట్రం ఏర్పడేనాటికి గోదావరి జలాల వినియోగంలో తెలంగాణ ఏ స్థాయిలో ఉన్నదో ఇప్పుడు మళ్లీ అదే స్థాయికి దిగజారుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఎగువ నుంచి శ్రీరాంసాగర్‌కు వరద వస్తే తప్ప, ఆయకట్టు రైతులు బతికి బట్టకట్టలేని పరిస్థితులు ఉండేవి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతుల తలరాతను మార్చి, ప్రధాన గోదావరి ఎండిపోయినా ప్రాణహిత జలాలతో సాగునీటికి ఢోకా లేకుండా చేసింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దశాబ్దం కిందటి విషాద దృశ్యాలు మళ్లీ కనిపిస్తు న్నాయి. నీటి కోసం రైతులు మళ్లీ మొగులు దిక్కు చూసే దుస్థితి దాపురిస్తున్నది.
-(గుండాల కృష్ణ)
Godavari | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 19 (నమస్తే తెలంగాణ): నవ్వినోడి ముందు జారిపడినట్టు.. తెలంగాణలో గోదావరి జలాల వినియోగం పెరుగుదల మూణ్నాళ్ల ముచ్చటగానే మారిం ది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్‌లను ఎండబెట్టడంతో ఇకనుంచి ప్రధాన గోదావరికి వరద వస్తే తప్ప, దాదాపు 25 లక్షలకుపైగా ఎకరాలకు సాగునీరు అందేలా లేదు. గత ఆరేడేండ్లుగా శ్రీరాంసాగర్‌కు ఇన్‌ఫ్లోలు ఆశాజనకంగానే ఉన్నాయి. గత 20 ఏండ్ల రికార్డులను పరిశీలిస్తే, వరుసగా మూడేండ్లపాటు ఎగువ నుంచి
దాఖలాలు ఉన్నాయి. గత యాసంగిలోనే ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో సాగునీటి కోసం రైతులు అల్లాడిపోవడంతో అంతకుముందు ఏడాదితో పోలిస్తే, సాగు విస్తీర్ణంతోపాటు దిగుబడి సైతం పడిపోయినట్టు గణాంకాలు చెప్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గణనీయంగా పెంచిన గోదావరి జలాల నీటి సామర్థ్యంతో రైతులను ఆదుకునే పరిస్థితి ఉన్నప్పటికీ రానున్న వర్షాకాలంలో బాబ్లీ మీదుగా కిందకు గోదారమ్మ ఉరకలు వేస్తే తప్ప లక్షలాది ఎకరాల్లో నాగలి ముందుకు కదిలేలా లేదు.
ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు ఘనంగా చెప్పుకుంటున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు 1963లో శంకుస్థాపన చేస్తే, 1984లో క్రస్టుగేట్లను ఏర్పాటు చేశారు. అంటే రెండు దశాబ్దాల తర్వాతగానీ నీటిని నిల్వ చేయలేదు. ఆ తర్వాత 1994లో ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ రీసెర్చి ల్యాబరేటరీస్ (ఏపీఈఆర్‌ఎల్) హైడ్రోగ్రాఫిక్ సర్వే చేయగా.. ఎస్సారెస్పీ నిల్వ సామర్థ్యం 112 టీఎంసీల నుంచి 90.30 టీఎంసీలకు అంటే పదేండ్లలోనే 21.70 టీఎంసీల మేర పడిపోయినట్టుగా తేలింది. 2013 డిసెంబర్-2014 జనవరిల్లో అధునాతనమైన ఇంటిగ్రేటెడ్ బోట్ మౌంటెడ్ బాతిమెట్రిక్ సర్వే (ఐబీఎస్) విధానంతో మరోసారి హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహించగా.. నీటి నిల్వ సామర్థ్యం ఏకంగా 80.104 టీఎంసీలకు పడిపోయినట్టుగా గుర్తించారు.
ప్రాజెక్టు వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం కంటే 31.912 టీఎంసీలు (28.48%) తగ్గిందన్న మాట. పైపెచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రతో చేసుకున్న లోపభూయిష్టమైన ఒప్పందాన్ని ఆసరాగా చేసుకొని, ఎస్సారెస్పీ ఎఫ్ఆర్ఎల్ పరిధిలోనే మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టును నిర్మించింది. ఇప్పటికీ నీటిపారుదల శాఖ అధికారులు శ్రీరాంసాగర్ నిల్వ సామర్థ్యాన్ని 90 టీఎంసీలుగా రికార్డుల్లో చూపుతున్నా వాస్తవ సామర్థ్యం 80.104 టీఎంసీలేనని సర్వేలు చెప్తున్నాయి.
ఈ క్రమంలో మొదటి దశలో 9,68,640 ఎకరాల ఆయకట్టు, రెండో దశలో 3,98,192 ఎకరాలు ఇలా రెండు దశల్లో కలిపి 13,66,832 ఎకరాల ఆయకట్టు ప్రణాళికలతో దశాబ్దాలపాటు కొనసాగిన పనులు తెలంగాణ ఏర్పడేనాటికి కూడా పూర్తికాలేదు. కీలకమైన కాకతీయ కాల్వ ప్రవాహ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులైతే, రాష్ట్రం ఏర్పడేనాటికి అందులో 3 వేల క్యూసెక్కులు కూడా పారే పరిస్థితులు లేకుండాపోయాయి. దీనికితోడు ఎస్సారెస్పీ ఆధారంగా అలీసాగర్, గుత్ప ఎత్తిపోతలతోపాటు అనేక లిఫ్టు ప్రాజెక్టులు, కాల్వల మీద మోటర్లతో పారించుకునే భూములు… ఇలా అన్నీ లెక్కేస్తే 22 లక్షల ఎకరాల ఆయకట్టు దీనిపై ఆధారపడి ఉన్నది.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒకవైపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడంతోపాటు ఎస్సారెస్పీ ప్రాజెక్టులోని పెండింగ్ పనులన్నీ పూర్తిచేశారు. కాకతీయ కాల్వ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులకు పునరుద్ధరించారు. 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎస్సారెస్పీ జలాలను కేవలం సరస్వతి, లక్ష్మీ కెనాల్, ఎల్ఎండీ ఎగువన ఉన్న ఆయకట్టుకు మాత్రమే పరిమితం చేశారు. ఎల్ఎండీ దిగువనున్న ఆయకట్టు మొత్తానికి దాదాపుగా కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన జలాలనే తరలిస్తూ వచ్చారు.
ఒకవైపు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు, మిషన్ భగీరథ పథకాలకు మండు వేసవిలోనూ నీటి లభ్యత ఉంచడంతోపాటు ఎండాకాలంలో కూడా ప్రతి గ్రామంలోని చెరువులు జలకళతో కళకళలాడేలా ఎప్పటికప్పుడు కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోశారు. అందుకే తెలంగాణ ఏర్పడేనాటికి 2014-15లో తెలంగాణ రైతులు పండించిన ధాన్యం రూ.12,871.01 కోట్ల విలువైన 68.17 లక్షల టన్నులు ఉండగా, 2019-20లో ఏకంగా 180.53 లక్షల టన్నులకు, వాటి విలువ రూ.34,084 కోట్లకు చేరింది. అంటే వృద్ధి 80.53 లక్షల టన్నులు. తదుపరి 2020-21 కరోనా సమయంలో కూడా 265.34 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది.
2022-23లో 278.30 లక్షల టన్నులతో రూ.54,546.80 కోట్ల ధాన్యం ఉత్పత్తి కాగా… 2023-24లో 256 లక్షల టన్నులు నమోదైంది. ఇందులో ఎస్సారెస్పీ పరిధిలోనే రికార్డుస్థాయి ధాన్యం ఉత్పత్తి జరిగింది. గత యాసంగిలో కాళేశ్వరం జలాలు అందుబాటులో లేకపోవడంతో ఉన్న నీటి నిల్వలతోనే ప్రభుత్వం సరిపెట్టాల్సి వచ్చింది. ఫలితంగా అనేకచోట్ల రైతులు సాగునీటి కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేసి ఆందోళనబాట పట్టారు. అనేకచోట్ల పంటలు ఎండిపోవడంతోపాటు సాగునీరు సరిగా అందక దిగుబడి తగ్గింది. అందుకే 2022-23తో పోలిస్తే 2023-24లో ధాన్యం దిగుబడి అంకెలు తక్కువగా నమోదయ్యాయి.
ప్రస్తుతం గోదావరి బేసిన్‌లోని ఎస్సారెస్పీ మొదలు ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఎల్ఎండీతోపాటు అన్నపూర్ణ, రంగనాయకసాగర్, అనంతసాగర్ జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు… క్షేత్రస్థాయిలో పండిస్తున్న పంటలకు కావాల్సిన సాగునీటి పరిమాణానికి పొంతన లేదు. ఎక్కడా చెరువుల్లో జలకళ లేదు. వీటికితోడు రానున్న వేసవిలో హైదరాబాద్‌తోపాటు గ్రామాల తాగునీటి అవసరాలను కూడా పరిగణనలోనికి తీసుకోవాలి. కాళేశ్వరం బరాజ్‌లను ఎండబెట్టడంతో రానున్న వర్షాకాలం వరకు అదనంగా చుక్క నీరు కూడా అందదు. దీంతో గత యాసంగిలోని కష్టాలు మళ్లీ మొదలుకానున్నాయని ఇంజినీర్లు చెప్తున్నారు. వీటన్నింటికీ మించి వచ్చే వర్షాకాలంలో వర్షాలు ఆలస్యమైతే జలాశయాల్లో నీటి నిల్వ ఉండే పరిస్థితులు లేనందున కాలం కూడా ఆలస్యమయ్యే ప్రమాదం పొంచి ఉన్నది.
గోదావరి బేసిన్లో 2014కు పూర్వపు పరిస్థితులే కనిపిస్తున్నాయని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎగువన బాబ్లీ నుంచి దిగువకు నీళ్లు వస్తే తప్ప ఎస్సారెస్పీ నిండదు. గత 20 ఏండ్ల రికార్డులను పరిశీలించినా వరుసగా మూడేండ్లపాటు శ్రీరాంసాగర్ ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రధాన గోదావరిపైనే లక్షలాది ఎకరాల ఆయకట్టు ఆధారపడాలి. ప్రధాన గోదావరిలో గరిష్ఠంగా నెలన్నర మాత్రమే ఇన్‌ఫ్లోలు ఉంటాయనేది దశాబ్దాల రికార్డులు చెప్తున్నాయి.
ఈ వ్యవధిలో ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మసాగర్ వరకు ఎత్తిపోయగలిగే జలాలు ఎంత? ఆ నిల్వ మేరకు సాగునీరు అందించే ఆయకట్టు ఎంత? అనేది దైవాదీనంగా మారుతున్నది. ఈ నిల్వలు ఏడాది పొడవునా ఉండనందున తిరిగి తెలంగాణ రైతాంగం మళ్లీ మొగులు దిక్కు చూడాల్సిన విషమ పరిస్థితి ఏర్పడుతున్నది. తెలంగాణ ఏర్పడేనాటికి తెలంగాణ గోదావరి జలాల వినియోగంలో కేవలం ప్రధాన గోదావరిపైనే ఆధారపడే పరిస్థితి మళ్లీ వచ్చిందనేది సుస్పష్టం. కేసీఆర్ హయాంలో నిల్వ సామర్థ్యాన్ని 141 టీఎంసీల మేర పెంచుకోగలిగినా కీలకమైన ప్రాణహిత జలాల మళ్లింపును అటకెక్కించడంతో ఎస్సారెస్పీ, కాళేశ్వరం ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టులో సాగు అనేది వరుణదేవుడి దయ.. తెలంగాణ రైతుల ప్రాప్తంగా మారనున్నది.