హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అంటే గిట్టనట్టుగా, ఇక్కడి వినతులు, విజ్ఞాపనలు పట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం అన్నింటికీ తలూపుతూ వస్తున్నది. అడిగిందే తడవుగా ఆగమేఘాలపై స్పందిస్తున్నది. నీటిపారుదల ప్రాజెక్టులకు అనుమతులిస్తున్నది. అందుకోసం కేంద్ర సంస్థలనూ ఒత్తిడి చేస్తున్నది. తెలంగాణ ఆవిర్భావం నుంచీ మన నీటి హక్కులపై ఉక్కుపాదం మోపుతూ వచ్చిన మోదీ సర్కారు.. రాష్ట్రం చేసిన ప్రతిపాదనలను ఏనాడూ పట్టించుకోలేదు.
అభ్యంతరాలనూ లెక్కచేయలేదు. నీటివాటాలను తేల్చడంలో, ప్రాజెక్టు అనుమతుల మంజూరులో, నిధుల కేటాయింపులో.. అన్నింటా తెలంగాణను విస్మరిస్తున్నది. రాష్ట్ర హక్కుల్ని బేఖాతరు చేస్తూనే.. ఏపీ ముందు మాత్రం కేంద్రంలోని బీజేపీ సర్కారు సాగిలపడుతున్నది. బనకచర్ల విషయంలో ఇదే విషయం మరోసారి స్పష్టమైంది. గత నవంబర్‌లో బనకచర్ల ప్రతిపాదనను బాబు ప్రభుత్వం తెరపైకి తెచ్చినప్పటినుంచీ కేంద్రం అత్యంత వేగంగా స్పందిస్తూ వచ్చింది. తొలి వినతిలోనే ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం రుణ సమీకరణకు అనుమతిస్తామని ప్రకటించిన కేంద్రం.. 20 శాతం నిధులు ఇచ్చేందుకూ సమ్మతించింది. ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలించాల్సిందిగా కేంద్ర సంస్థలను ఆదేశించింది. ఏపీ ఇచ్చిన ప్రీ ఫీజిబులిటీ రిపోర్ట్‌పైనా వేగంగా చర్యలు చేపట్టింది. ఆగమేఘాలపై తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులను ఒప్పించే బాధ్యతను తానే భుజాన వేసుకుని.. ఢిల్లీలో ప్రత్యేక సమావేశం సైతం నిర్వహించింది.
11 ఏండ్లుగా తెలంగాణ ప్రధాన డిమాండ్లు..
Banakancharla
బనకచర్లపై ఏపీ ఒత్తిడి.. కేంద్రం హడావుడి..
పదేండ్లుగా తెలంగాణ వినతులను, ఫిర్యాదులను పెడచెవిన పెట్టిన కేంద్రం.. ఏపీ విషయంలో మాత్రం మొదటినుంచీ ఎక్కడలేని అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నది. తాజాగా బనకచర్ల ఉదంతంలోనూ ఇదే స్పష్టమైంది. అనుమతులు తీసుకోకుండానే గోదావరి జలాల నుంచి 200 టీఎంసీలను తరలించేందుకు పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపు రూ.80 వేల కోట్లతో రూపొందించిన ఏపీ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం సైతం వత్తాసు పలుకుతున్నది. బనకచర్ల ప్రాజెక్టుకు ఆర్థికసాయం అందించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుడు నవంబర్ 11న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.
డిసెంబర్లో ప్రధాని మోదీ, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌లను నేరుగా కలిసి విన్నవించారు. వెనువెంటనే ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం మేరకు రుణ సమీకరణకు ఎఫ్ఆర్బీ అనుమతినిస్తామని, 20శాతం నిధులను నుంచి గ్రాంట్‌గా ఇస్తామని కేంద్రం ప్రకటించేసింది. అంతేకాదు ఏపీ ప్రతిపాదనలను పరిశీలించాలని వెనువెంటనే అన్ని కేంద్ర సంస్థలకు ఆదేశాలను జారీ చేసింది. 2025 మే 24న మరోసారి కేంద్ర ఆర్థికశాఖ మంత్రిని ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా కలిసి ప్రాజెక్టుకు నిధులివ్వాలని కోరారు. కేంద్రం సానుకూలత వ్యక్తంచేయడంతోపాటు ప్రతిపాదనలను స్వయంగా సూచించారు.
దీంతో జూన్ 2న కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేథ్‌కు ప్రాజెక్టుపై ఏపీ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా పీఎఫ్ఆర్ (ప్రీ ఫీజబిలిటీ రిపోర్టు)ను సైతం ఏపీ సమర్పించింది. కేంద్రం ఆగమేఘాలపై పీఎఫ్ఆర్ను కేంద్ర జల్‌శక్తి శాఖకు పంపగా, ఆ శాఖ సైతం అంతే వేగంగా జూన్ 10న సీడబ్ల్యూసీ, గోదావరి, కృష్ణా రివర్బోర్డులతోపాటు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, బేసిన్‌లోని అన్ని రాష్ర్టాలకు పంపింది. అభిప్రాయాలను తెలపాలని సూచించడం కాదు.. ఈ నెల జూలై 24 తేదీలోగా అభిప్రాయాలను వెల్లడించకుంటే ఆ తరువాత పంపినా పరిగణనలోకి తీసుకోబోమని అల్టిమేటం సైతం జారీ చేయడం గమనార్హం. ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు కోసం కేంద్ర జల్‌శక్తి శాఖనే మధ్యవర్తిగా మారి ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులను పిలిచి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వారంలో కమిటీ వేసి, నెల రోజుల్లో నివేదిక తెప్పించుకుని అనుమతులు ఇచ్చేందుకు రంగం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఏపీ తాన అంటే.. కేంద్రం తందాన అంటూ ముందుకు సాగుతున్న తీరు అందరికీ అర్థమవుతున్నది.
ఏపీ అడిగిందే తడువుగా వరాలు
తెలంగాణపై అడుగడుగునా వివక్ష చూపుతున్న కేంద్రం.. ఏపీకి మాత్రం వరాలు కురిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో చంద్రబాబు కోరిన వెంటనే కేంద్రం స్పందించి.. పోలవరం ముంపు మండలాలు ఏడింటిని ఏపీలో విలీనం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇచ్చింది. నిధులను సమకూర్చుతున్నది. వాస్తవంగా శ్రీశైలం ప్రాజెక్టును హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుగానే ట్రిబ్యునల్ గుర్తించింది. జలవిద్యుత్తు ఉత్పత్తి చేస్తూ నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు విడుదల చేసి, ఆ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు అందివ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్థాపిత సామర్థ్యం మేరకు జలవిదుత్తు ఉత్పత్తి చేపట్టాలని జారీ చేసిన జీవో34ను ఏపీ వ్యతిరేకింది. ఏపీ ఫిర్యాదు చేయగానే బోర్డు ఇప్పటిదాకా ఆంక్షలను అమలు చేస్తున్నది. తెలంగాణ అనేక ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించింది. ఏపీ గోదావరి, కృష్ణా బేసిన్లకు సంబంధించి ఒక్క ప్రాజెక్టు డీపీఆర్‌ను కూడా సమర్పించలేదు. అయినా కేంద్రం అదేమని అడిగిందీ లేదు!.. ఏపీని ఆపిందీ లేదు!