జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 6 ( నమస్తే తెలంగాణ ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. యాసంగి ప్రారంభంలోనే సాగు నీటి సమస్య మొదలైంది. భూగర్భ జలాలు అడుగంటుతుండటం, చెరువుల్లో నీటి మట్టం తగ్గడం.. బోర్లపై ఆశలు సన్నగిల్లడం.. మానేరు, చలివాగు ఎండిపోవడం తదితర కారణాలతో అన్నదాతల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. రైతులు ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులను గుర్తుచేసుకుంటున్నారు. మరో నెల రోజులు ఇలాగే ఉంటే అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశాలున్నాయి. గత యాసంగిని పోల్చితే ప్రస్తుతం 0.40 లోతుల్లోకి భూగర్భ జలాలు అడుగంటాయి. నిరుడు ఇదే సమయంలో సైతం ఇంతగా సాగునీటి సమస్య తలెత్తలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పక్కకు పెట్టడంతో అన్నదాతల ఆక్రందనలు ప్రారంభమయ్యాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని రైతులు కాళేశ్వరం ప్రాజెక్టును గుర్తుచేసుకుంటున్నారు. కాళేశ్వరం వల్ల భూగర్భ జలాలు పెరిగినట్టు చెప్తున్నారు.