గోదావరిలో 1000టీఎంసీలు, కృష్ణాలో 500టీఎంసీలను తెలంగాణకు జలహక్కులను రాసిస్తే సరిపోతుంది. ఆ తరువాత ఏపీ బనకచర్ల ప్రాజెక్టును అంగీకరిస్తాం.
– సీఎం రేవంత్‌రెడ్డి (జూన్19న సచివాలయంలో మీడియా తో)
ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదు. నా మొదటి ప్రాధాన్యం చర్చలు జరపడమే. దాని ద్వారా వివాదాలు పరిష్కారమవుతాయి. బనకచర్ల ప్రాజెక్టు విషయమై అవసరమైతే నేనే చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తా.
– సీఎం రేవంత్‌రెడ్డి (జూన్20న సచివాలయంలో చిట్‌చాట్‌లో)
వరద జలాల్లో లెక తేలాక, తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకున్న తరువాత బురద ఉన్నదా.. వరద ఉన్నదో తేలుతుంది. ఎవరేం కట్టుకుంటారనేది గోదావరి రివర్ బోర్డు ముందే చర్చిద్దాం. పతార ఉందని పైకి వెళ్లి అనుమతులు తెచ్చుకుంటామంటే ఎలా? మోదీ మేం చెప్పింది వింటాడని పై నుంచి కిందకు వస్తారా? న్యాయపరంగానే బనకచర్లపై పోరాడుతున్నాం. మేం అందరి దగ్గరికీ వెళ్తున్నాం.
– సీఎం రేవంత్‌రెడ్డి (జూలై9న ప్రజాభవన్‌లో)
కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో బనకచర్లపై చర్చనే జరగలేదు. కాబట్టి అడ్డుకుంటామనే ప్రస్తావనే రాలేదు. జలవివాదాలకు సంబంధించి కమిటీ వేస్తారు. ఆ కమిటీ నెలరోజుల్లో నివేదిక ఇస్తుంది. మనం వేసిన కమిటీనే కాబట్టి అది ఏది చెబితే అది అంగీకరించడం శిరోధార్యం.
– సీఎం రేవంత్‌రెడ్డి (జూలై16న ఢిల్లీలో మీడియా సమావేశంలో)
నోటితో చెప్పి, నొసటితో వెక్కిరించినట్టు.. మాట ల మాటున వేటు వేసినట్టు.. కలిసి నడుస్తూనే కాటేసినట్టు.. ఆట చాటున వెన్నుపోటు పొడిచినట్టు.. బనకచర్ల కోసం మన నీటివాటాను బలిపెట్టింది బా బు-రేవంత్ ద్వయం. తడిగుడ్డతో తెలంగాణ గొంతు కోసి.. పైకి మాత్రం అమాయకంగా ఆడుతున్న నాటకం అందరికీ అర్థమవుతున్నది. అది.. తెలంగాణ నీటిబొట్టును ఆంధ్రాకు తాకట్టు పెట్టిన నయవంచన!
బనకచర్లపై రేవంత్ వైఖరి మొదటి నుంచీ అనుమానాస్పదంగానే ఉన్నది. రోజుకో మాట.. పూటకో తీరు.. డ్రామా డైలాగ్.. డైలీ డైవర్షన్.. తెలంగాణ చూస్తూనే ఉన్నది. తీరా ‘ఢిల్లీ మంత్రాంగం’తో లోలోని గుట్టు రట్టయ్యింది. తెలంగాణను నమ్మించి మోసం చేయడం ఒక్కటే కాదు! ముఖ్యమంత్రికేదో తెలంగాణ హక్కుభుక్తం చేసినట్టు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎవరికైనా తాకట్టు పెట్టుకునే అధికారమేదో ఆయనకు దఖలు పరిచినట్టు.. రేవంత్ వ్యవహరిస్తున్న తీరు మరింత ప్రమాదకరం! తెలంగాణ భవితవ్యాన్ని నిర్దేశించే అంశాలపై ఎవరినీ సంప్రదించకుండా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ప్రమాదకరం! ముఖ్యమంత్రి అంటే ధర్మకర్త అని మరిచి, ప్రజలిచ్చిన అధికారం ఐదేండ్లేనన్న వాస్తవాన్ని వదిలేసి తరతరాలపాటు తెలంగాణను శాపగ్రస్థగా మిగిల్చేలా తలరాతను, జలరాతను తిరగరాస్తున్న తీరు మరింత ప్రమాదకరం!
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 17 (నమస్తే తెలంగాణ): ముందూవెనుక చూడకుండా మనవాడేలే అని అతిగా నమ్మితే నయవంచనతో ముంచేస్తుంటారన్నది లోకోక్తి. కొందరు తడిగుడ్డతో గొంతు కోసినట్టుగా మనకేమాత్రం తెలియకుండా మోసం చేస్తుంటారు. బనకచర్ల వ్యవహారంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి ఇదే తరహాలో వ్యవహరించారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నామనో, మోదీ తమ చేతుల్లో ఉన్నాడనో బనకచర్లపై బుల్డోజ్ చేయాలనుకుంటే తగిన వేదికలపై అడ్డుకుంటాం అని ప్రగల్భాలు పలికిన నోటితోనే, బనకచర్ల ఆగదు అనే సంకేతం ఇచ్చారని సాగునీటిరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన భేటీయే దీనికి వేదిక అని పేర్కొంటున్నారు.
‘బనకచర్ల అంశం చర్చకు వస్తే బాయ్‌కాట్ చేస్తా’ అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో లేఖ రాయించి, మరుసటి రోజే చంద్రబాబు పంచన చేరి బనకచర్లకు బార్లా తలుపులు తెరవడం తెలంగాణ సమాజాన్ని వంచించడమే. అంతేకాదు నదీజలాల విషయంలో అన్యాయం జరగకుండా ఉండేందుకు పార్లమెంటు సాక్షిగా ఆమోదించిన ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014ను కూడా తుంగలోతొక్కారు. నిపుణుల కమిటీ, నెల రోజుల్లో నివేదిక వంటివన్నీ బనకచర్లను అడ్డుకునేందుకు కాదని, ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసే ఎత్తుగడ అన్నది నిపుణుల మాట. లోతుగా విశ్లేషిస్తే ఈ భేటీ కేవలం గోదావరిజలాల్లోనే కాదు కృష్ణాజలాల పంపకాల్లోనూ తెలంగాణకు చారిత్రక ప్రతికూల పరిణామాలను తెచ్చి పెడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు-రేవంత్‌రెడ్డి ద్వయం కలిసి పక్కా వ్యూహంతో తెలంగాణకు ఉరేసిన వాస్తవం కండ్లముందు ఆవిష్కృతం అవుతుందన్నారు. రాజకీయ ప్రయోజనాల ముందు ప్రజా ప్రయోజనాలు బలాదూర్ అనేందుకు బనకచర్లపై చంద్రబాబు-రేవంత్‌రెడ్డి ఆడుతున్న హైడ్రామానే నిదర్శనం. సముద్రంలో కలిసే 3వేల టీఎంసీల్లో 200 టీఎంసీలను మళ్లించి బనకచర్ల ప్రాజెక్టు చేపడుతున్నామంటూ ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు.
బనకచర్ల అనేది గోదావరి బేసిన్‌లోని నదుల అనుసంధాన ప్రాజెక్టు. కాబట్టి బేసిన్‌లోని ఏడు రాష్ర్టాలను ఇందులో భాగస్వాములను చేయాల్సి ఉంటుంది. అందుకే ఆ చిక్కులు రావొద్దని చంద్రబాబు, కేంద్ర ప్రభ్వుత్వం కలిసి దీనిని తెలుగు రాష్ర్టాలకు పరిమి తం చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో తెలుగు రాష్ర్టాల పరిధిలోని ఏపీ పునర్విభజన చట్టాన్ని సైతం తుంగలో తొక్కడం మరో వంతు. తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదాలు, నదీజలాల అంశాలపై ఏకాభిప్రాయం రాకపోతే ఏం చేయాలనే దానిపై విభజన చట్టంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి.
తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించి, ఇక్కడి రైతాంగానికి చారిత్రక అన్యాయం చేసే బనకచర్లను అడ్డుకునేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి అనేక మార్గాలున్నాయి. ‘కేంద్రంలో నీ పతార ఉందని అనుకుంటే బనకచర్లను ఎట్ల అడ్డుకోవాల్నో మాకు తెలుసు’ అని రేవంత్‌రెడ్డి మీడియా ముందు వ్యాఖ్యానించారు. అంటే అంతకుముందే అధికారు లు, నిపుణులతో చర్చించి ఉంటారు. కాబట్టి ఆయనకు అడ్డుకునే మార్గాలన్నీ తెలుసు. కానీ ఇప్పుడు బనకచర్లకు న్యాయపరమైన చిక్కులు, అడ్డంకులు లేకుండా చంద్రబాబుతో నేరుగా చర్చలకు దిగారు.
కేవలం ఇద్దరు ముఖ్యమంత్రులే భేటీ అయితే రాజకీయంగా ఇబ్బంది ఉంటుందని, ‘కేంద్ర ప్రభుత్వ మధ్యవర్తిత్వం’ అనే రంగును పులిమారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా గురువారం ఢిల్లీలో జరిగిన చిట్‌చాట్‌లో ‘కేంద్రం పిలిస్తే పోవద్దా’ అని సీఎం రేవంత్ కప్పిపుచ్చుకునే వ్యాఖ్యలు చేశారు. నిజమే, కేంద్రం పిలిస్తే పోవచ్చు. కానీ బనకచర్లను చిత్తశుద్ధితో వ్యతిరేకించి ఉంటే బుధవారం పరిస్థితి వేరేలా ఉండేది. బనకచర్ల చర్చ వస్తే బాయ్‌కాట్ చేస్తాం అని సీఎం ప్రగల్భాలు పలికారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం మీడియాతో ‘బనకచర్ల చర్చకొస్తే బాయ్‌కాట్ చేస్తాం చూడండి’ అని సవాల్ విసిరారు.
కానీ ఢిల్లీలో జరిగింది పూర్తిగా భిన్నం. నిన్నటిదాకా కేంద్రాన్ని ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆ ఊసే ఎత్తకుండా కేంద్రం పిలిచిందే తడవుగా వెళ్లి నిపుణుల కమిటీని ప్రతిపాదించి వచ్చారు. పవర్‌పాయింట్ ప్రజంటేషన్లలో మిగులుజలాలపై ఏపీకి మాత్రమే హక్కులుంటాయా? ఎగువ రాష్ర్టాలకు కూడా ఉంటాయి కదా అని నిలదీసిన రేవంత్‌రెడ్డి, ఢిల్లీ భేటీలో ఆ ప్రస్తావనే చేయలేదు. పైగా కమిటీతో ఏం జరుగుతుందో కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పేశారు.
‘మనం వేసుకున్న కమి టీ. అది ఏం చెబుతుందో దానిని అమలు చేయాలి కదా’ అని పేర్కొన్నారు. అంటే భవిష్యత్తులో కమిటీ చెప్పిందంటూ బనకచర్లకు తెలంగాణ తరఫున పచ్చ జెండా ఊపడం ఖాయమని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తద్వారా నదీ యాజమాన్య బోర్డులు, అపెక్స్ కమిటీ సమావేశాలు, ఇతర వివాదాలు రాకుండా ప్రాజెక్టు సుగమం చేసినట్టేనని విశ్లేషిస్తున్నారు.
బనకచర్ల ప్రాజెక్టుతో చంద్రబాబు తెలంగాణను గోదావరిజలాల్లోనే కాదు కృష్ణాజలాల్లోనూ మరోసారి చావు దెబ్బ కొట్టనున్నాడని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మద్రాసు (చెన్నై) తాగునీటి పేరుతో అంచెలంచెలుగా తెలంగాణ గుండెల్లో గునపంలా దింపిన పోతిరెడ్డిపాడు ప్రస్థానమే గోదావరిలో ఇప్పుడు పురుడుపోసుకుంటున్నదని చెప్తున్నారు. బనకచర్లపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన నివేదికలోనే ఈ తాలూకు ఛాయలు కనిపిస్తున్నాయన్నారు.
బనకచర్లను అడ్డుకోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి డిమాండ్ చేయాల్సింది. బంతి న్యాయస్థానంలో పడితే పోరాడేందుకు తెలంగాణకు చక్కటి అవకాశం దొరికేది. పైగా ఇది బేసిన్‌లోని ఏడు రాష్ర్టాలతో ముడిపడి ఉన్న ప్రాజెక్టు. ఒకవేళ చట్టబద్ధంగా వెళ్తే ఏడు రాష్ర్టాలను భాగస్వాములు చేయాల్సి వస్తుంది. దీని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు కలిసి నాటకం ఆడారని ఆరోపిస్తున్నారు.
ఈ అంశంపై అపెక్స్ భేటీ, గోదావరి బోర్డు, అథారిటీ ముందు చర్చిద్దామని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కగా, రేవంత్‌రెడ్డి కూడా మొదట్లో అడ్డుకుంటాం, నిలదీస్తాం అంటూ రంకెలు వేశారు. ఆ తర్వాత చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తానంటూ అందరిలోనూ అయోమయాన్ని సృష్టించారు.
ఎంపీలతో అఖిలపక్షం, రెండు సార్లు పవర్ పాయింట్ ప్రజంటేషన్లు అంటూ నెల రోజులు హడావుడి చేశారు. చివరికి ఢిల్లీకి వెళ్లే ముందు కూడా రాసిన లేఖ ద్వారా తెలంగాణ బాయ్‌కాట్ భ్రమల్లో ఉంచారు. అధికారులతో కమిటీకి ఒప్పుకోవడమే కాకుండా, ‘మనం వేసిన కమిటీ ఏది చెబితే అది అమలు చేయాలి కదా’ అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. దీనిని బట్టి నెల రోజుల హంగామా అంతా హైడ్రామా అని స్పష్టం అవుతున్నది.