నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 8: అకాల వర్షానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కలు తడిసి ముద్దయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి గాంధీనగర్లోని కొనుగోలు కేంద్రంలో నిల్వ చేసిన 40 వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది. వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన మక్కలు నీటిపాలయ్యాయి. దీంతో పలు గ్రామాల నుంచి మార్కెట్కు మక్కలు తెచ్చిన రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తడిసిన మక్కలు, ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చెన్నారావుపేట మండలం తిమ్మరాయిన్పహాడ్ కొనుగోలు కేంద్రంలోని వడ్లు నీటిపాలయ్యాయి.
ఎల్లాయగూడెం తండా బోడ రవికి చెందిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోయగా కొట్టుకుపోయింది. నెక్కొండ మండల కేంద్రంలోని పనికర గుట్ట ప్రాంతంలో ఆరబోసిన మక్కలు నీటిలో తడిసిపోయాయి. ములుగు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఏటూరునాగారం మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, బూర్గంపహాడ్, పాల్వంచ, దమ్మపేట తదితర మండలాల్లో వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లో ధాన్యం, మక్క బస్తాలు తడిసిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం, మొక్కజొన్నను కాపాడుకునేందుకు రైతులు నానాపాట్లు పడ్డారు.