హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): గత ఏడాది పత్తి కొనుగోళ్లలో అక్రమాలు జరిగింది నిజమేనని తేలింది. అక్రమాలను నిగ్గు తేల్చిన విజిలెన్స్ విభాగం, తన నివేదికను రెం డు రోజుల క్రితం ప్రభుత్వానికి అందించింది. మార్కెటింగ్ కార్యదర్శులు, వ్యవసాయ ఏవోలు, ఏఈవోలు కలిసి భారీ అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించారని తెలిసింది. ఈ నివేదికను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలిస్తున్నట్టు సమాచారం.
రాష్ట్రంలో మొత్తం 197 వ్యవసాయ మార్కెట్లు ఉండగా, విజిలెన్స్ విభాగంగా 30మార్కెట్లలో మాత్రమే విచారణ జరిపి అక్రమాలను తేల్చినట్టు తెలిసింది. మిగిలిన మా ర్కెట్లలోనూ అవకతవకలను తేల్చాల్సి ఉంది. విజిలెన్స్ ఇచ్చిన నివేదికలో ఎక్కడ, ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారనే అంశాలపై క్షుణ్ణంగా వివరించినట్టు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా మిగిలిన మార్కెట్లపై మా ర్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో విచారణ చేపట్టనున్నట్టు సమాచారం. విజిలెన్స్ నివేదికను రెండు మూడు రోజుల్లో మార్కెటింగ్ శాఖకు పంపించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎంత నష్టం జరిగింది, ఎవరిపై చర్యలు తీసుకోవాలనేది తేల్చనున్నారు.
నిరుడు ఇదే సమయంలో రైతుల నుంచి సీసీఐ పత్తి కొనుగోలు చేసింది. అయితే పత్తి కొనుగోళ్లలో ప్రైవేటు వ్యాపారులు, మార్కెటింగ్ కార్యదర్శులు, ఏవోలు, ఏఈవోలు, సీసీఐ అధికారులు కలిసి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా నకిలీ టీఆర్ (తాత్కాలిక రిజిస్ట్రేషన్)లతో విచ్చలవిడిగా అక్రమాలకు తెరలేపారు. నిజమైన రైతులకు ఇవ్వాల్సిన టీఆర్లను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఒక సీజన్లో ఏకంగా 54వేల టీఆర్లు జారీ చేయగా ఇందులో కేవలం 10వేలలోపు అసలు రైతులు ఉన్నారని, మిగిలిన 44 వేలు ప్రైవేటు వ్యాపారులకు జారీచేసినట్టు తెలిసింది.
ఈ టీఆర్ల సాయంతో ప్రైవేటు వ్యాపారులు రైతుల వద్ద తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేసి.. అదే పత్తిని సీసీఐ కేంద్రాల్లో ఎక్కువ ధరకు విక్రయించారు. వీళ్లంతా రైతుల నుంచి క్వింటాలుకు రూ.5500 నుంచి రూ.6వేల వరకు పత్తి కొనుగోలు చేసి ఆ తర్వాత నకిలీ టీఆర్లతో సీసీఐకి మద్దతు ధర రూ.7521కు అమ్మినట్టు దర్యాప్తులో వెల్లడైంది. సీసీఐలోని పలువురు అధికారులు జిన్నింగ్ మిల్లులు, ప్రైవేటు ట్రేడర్లతో కుమ్మక్కైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులను మోసం చేసి.. అడ్డదారిలో పత్తి విక్రయించి కోట్ల రూపాయలు ఆర్జించారనే విమర్శలున్నాయి. గతంలోనే ఏడుగురు మార్కెట్ కార్యదర్శులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఈ అవకతవకలపై శాఖాపరమైన దర్యాప్తుతోపాటు విజిలెన్స్ విచారణ కూడా చేయించింది.