Rythu Bharosa | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ ) : రైతుభరోసా పంపిణీలో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. భరోసా పరిస్థితి ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. ఒక ఎకరానికి జమ చేసిన తర్వాత మళ్లీ వారం గడిస్తే గానీ మరో ఎకరానికి జమకాని పరిస్థితి నెలకొన్నది. ఈ నెల 12వ తేదీన మూడెకరాలకు రైతుభరోసా జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన 13న నాలుగెకరాల రైతుల ఖాతాల్లో సాయం జమ కావాలి. కానీ, ఆరు రోజులు గడుస్తున్నప్పటికీ నాలుగు ఎకరాల రైతులకు భరోసా అందించే విషయమై సర్కారు ఊసెత్తడం లేదు. యాసంగి రైతుభరోసా పంపిణీని ప్రారంభించి 22 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు మూడెకరాల వరకు మాత్రమే పూర్తయింది. ఈ సీజన్లోనూ గత యాసంగి మాదిరిగానే పంటల కోతల సమయంలో జమవుతుందేమోననే చర్చ రైతుల్లో జరుగుతున్నది.
ఇప్పటి వరకు మూడెకరాలకు పంపిణీ జరగగా.. సర్కారు నాలుగు వాయిదాలు వేసింది. జనవరి 26న పైలట్ గ్రామాల్లో 4.41 లక్షల మంది రైతులకు రూ.568.99 కోట్లు జమ చేసింది. ఆ తర్వాత తొమ్మిది రోజులకు ఫిబ్రవరి 5న ఎకరం భూమి కలిగిన 17.03 లక్షల మంది రైతులకు రూ.557.54 కోట్లు జమయ్యాయి. ఆ తర్వాత ఐదు రోజులకు 10న రెండెకరాల రైతులకు భరోసా అందింది. అనంతరం రెండు రోజులకు 12న మూడెకరాల రైతులకు జమ చేసింది. ఈ లెక్కన 13న నాలుగెకరాల రైతులకు రైతుభరోసా జమ కావాలి. కానీ, ఇప్పటికే ఆరు రోజులు గడుస్తున్నా.. నాలుగెకరాల రైతులకు రైతుభరోసా పత్తా లేదు.
బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు పంపిణీ ప్రారంభమైన తర్వాత రోజుకు ఎకరం చొప్పున పదిహేను రోజుల్లో మొత్తం రైతులకు పెట్టుబడి సాయం జమయ్యేది. తమకు ఏ రోజున అందుతుందో రైతులే లెక్కలేసుకునేవారు. కానీ, కాంగ్రెస్ హయాంలో రైతుభరోసా పంపిణీపై ఏర్పడిన గందరగోళంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది. వాయిదాలపై వాయిదాలు వేస్తుండటంతో రైతుల్లో అసహనం పెరిగిపోతున్నది. ఇప్పటివరకు 44.82 లక్షల మంది రైతులకు భరోసా అందగా.. ఇంకా 30 లక్షల మందికి రూ.5,500 కోట్లు రావాల్సి ఉంది.
మూడెకరాల వరకు రైతులకు భరోసా జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పది గుంటలు, ఎకరం, రెండెకరాలు గల రైతులు కూడా తమకు ఇంకా అందలేదని చెబుతున్నారు. ఆయా రైతులు అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఇదిలా ఉంటే 8,500 సర్వే నంబర్లలోని పలువురు రైతుల 2 లక్షల ఎకరాలను ప్రభుత్వం బ్లాక్ చేసినట్టు తెలిసింది. ఇప్పుడు వారంతా లబోదిబోమంటున్నారు.