Revanth Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన అధికారాలను ప్రధాని మోదీ చేతికి అందిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలు మోదీ, రేవంత్ బంధాన్ని వెల్లడిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేపట్టాల్సిన విచారణలను కావాలనే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలకు అప్పగిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇప్పటికే గొర్రెల పంపిణీ పథకంపై అనుమానాలతో తొలుత విజిలెన్స్ విచారణ వేసిన రేవంత్ ప్రభుత్వం.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటర్ అయ్యేందుకు అవకాశం ఇచ్చింది. తాజాగా కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలకు అప్పగించడంపై కాంగ్రెస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దీనిపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేయడమంటే… రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే అనుమానాలు వ్యక్తమవుతాయని అంటున్నారు. ముఖ్యంగా కాళేశ్వరంపై విచారణను సీబీఐకి ఇవ్వాలనే సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయంపై సొంత పార్టీ నేతలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బద్దశత్రువైన బీజేపీ ప్రభుత్వం చేతిలో విచారణ పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం తమ అధికారాలను కేంద్రానికి అప్పగించడమేనని విమర్శిస్తున్నారు.
రాష్ట్ర వ్యవస్థలపై నమ్మకం లేదా?
రాష్ట్ర హోం శాఖను కూడా సీఎం రేవంత్‌రెడ్డే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అలాంటప్పుడు కాళేశ్వరంపై విచారణను తన ఆధీనంలోని రాష్ట్ర విచారణ సంస్థలకు కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించడం ఏమిటనే విమర్శలొస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని భావిస్తే విచారణను ఏసీబీకి అప్పగించొచ్చు.. లేదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) ఏర్పాటుచేసే అవకాశం కూడా ఉన్నది. ఒకవేళ ఇదీ కాదనుకుంటే.. అత్యంత పవర్ఫుల్ గల అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో స్పీకర్ నిర్ణయంతో హౌస్‌కమిటీ వేసే అవకాశం కూడా ఉన్నది. కానీ వీటన్నింటినీ వదిలేసి… కేంద్ర ప్రభుత్వం వద్ద గల సీబీఐని ఆశ్రయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంటే సీఎం రేవంత్‌రెడ్డికి తన ఆధీనంలోనే ఉన్న రాష్ట్ర విచారణ సంస్థలపై, పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేదా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఇలా రాష్ట్రంలో జరిగే వ్యవహారాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగిస్తూ పోతే… ఇక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విచారణ వ్యవస్థలు ఉండి ఎందుకు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కాళేశ్వరంపై సీబీఐతో విచారణ చేయించే అంత పెద్ద అవినీతి ఏమీకాదని కాంగ్రెస్ పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్, ఘోష్ కమిషన్ నివేదికలో కాళేశ్వరం అవినీతికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదని, అందుకే రాష్ట్ర సంస్థలతో విచారణ చేయిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని రేవంత్‌రెడ్డి భావించినట్టుగా గాంధీభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందుకే బట్టకాల్చి మీదేసే విధంగా ఈ విచారణను సీబీఐకి ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ను, కేసీఆర్‌ను, హరీశ్‌రావును బద్నాం చేయాలనే రాజకీయ కుట్ర చేస్తున్నారని చర్చించుకుంటున్నారు.
మోదీ ఏజెంట్‌గా రేవంత్?
సీఎం రేవంత్‌రెడ్డి పరిస్థితి తనవొకచోట.. మనసొకచోట అనే విధంగా ఉన్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మనసంతా బీజేపీ, మోదీ వద్ద ఉన్నదని, కానీ తప్పని పరిస్థితుల్లో ఆయన తనువు మాత్రం కాంగ్రెస్‌లో ఉన్నదనే విమర్శలున్నాయి. ఇందులో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికైనా బీజేపీకి, మోదీకి దగ్గరవ్వడం ఖాయమనే విమర్శలు రాజకీయవర్గాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే ఇప్పటినుంచే రూట్‌మ్యాప్ తయారుచేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీకి ఏజెంట్‌గా మారారని ఆరోపిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే అవసరం లేకపోయినప్పటికీ, రాష్ట్ర వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయించి.. రాష్ట్ర అధికారాలపై కేంద్రం పెత్తనం పెంచేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా ఇప్పటివరకు సీఎం రేవంత్‌రెడ్డి తమ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కన్నా.. ప్రధాని మోదీనే ఎక్కువసార్లు కలిశారని చెప్తున్నారు. రాహుల్‌గాంధీని కలిసినప్పుడు రేవంత్ ముఖంలో పెద్దగా సంతోషం కనిపించదని, మోదీని కలిసినప్పుడు మాత్రం ఆయన ముఖం వెయ్యి ఓల్టుల బల్బ్‌లా వెలిగిపోతుందని అంటున్నారు.