హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై నమోదు చేసిన కేసుల్లో బీఎన్ఎస్ఎస్ 35 కింద నోటీసు ఇచ్చాక కేసు దర్యాప్తు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు, ఫిర్యాదుదారుకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత సమయంలో జింకలు భయపడి పారిపోయినట్టుగా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టు పెట్టారంటూ క్రిశాంక్‌పై పోలీసులకు మూడు ఫిర్యాదులు అందాయి.
మొయినాబాద్‌లోని చిలుకూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్, టీపీసీసీ సోషల్ మీడియా విభాగం చైర్మన్ మన్నె సతీశ్ కుమార్, ఎన్ఎస్యూఐ నాయకుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా గచ్చిబౌలి పోలీసులు క్రిశాంక్‌పై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఒకే అంశంపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం చట్టవిరుద్ధమని, ఆ కేసులను కొట్టివేయాలంటూ క్రిశాంక్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మంగళవారం జస్టిస్ తుకారాంజీ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ను దర్యాప్తు చేసే ముందు బీఎన్ఎస్ఎస్ 35 సెక్షన్ కింద నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. పోలీసుల విచారణకు సహకరించాలని క్రిశాంక్‌ను ఆదేశించారు.