మంచాల, ఫిబ్రవరి 24 : మద్యం మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపిన ఘటన రంగారెడ్డిజిల్లా మంచాల మండలం నోములలో చోటుచేసుకున్నది. మంచాల పోలీసుల కథనం ప్రకారం..నోములకు చెందిన మాదరమోని బాబు తాపీమేస్త్రీ పనిచేస్తున్నాడు. గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగిన జాతరలో బాబు, అతని భార్య మాదరమోని అమృత(46)కు ఘర్షణ జరిగింది. దీంతో అమృతను హతమార్చాలని పథకం పన్నిన బాబు మంగళవారం మధ్యాహ్నం అతిగా మద్యం సేవించి వచ్చి ఆమె నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపాడు. గ్రామస్తులు, బంధువులు, కుటుంబసభ్యులు అక్కడికి చేరుకునే లోపే పరారయ్యాడు. అమృతకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు ఘటనాస్థలంలో వివరాలు సేకరించారు.