KCR | హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ‘ఎవడన్నా వింటే తెలంగాణ పజీతపోద్ది. ఎక్కడైనా సీఎం అనేవాడు నా మంత్రులు నాకు వింటలేరు. నన్ను పనిచేయనిస్తలేరు’ అని అంటారా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ ఎక్కడా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల పేర్లను ప్రస్తావించకుండానే 14 నెలలుగా కాంగ్రెస్ సర్కారు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను చీల్చిచెండాడారు. ‘ఎన్నికల ముందు పీపీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డిసెంబర్ 9న మన ప్రభుత్వం వస్తుంది. మీరు ఇప్పటి దాకా రుణాలు తీసుకోకపోతే వెళ్లి తీసుకోండి. నేను వచ్చిన తర్వాత రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నడు. జనం మోసపోయి, ఆశపడ్డరు. ఇప్పుడు నాలుక మడతపెడుతున్నడు’ అని విమర్శించారు. ‘రుణమాఫీ ఎప్పుడిస్తవు అని బీఆర్ఎస్ వెంబడిపడితే ఆఖరికి ఇగో ఇస్తున్నమని ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నది’ అని ఎద్దేవాచేశారు. వాస్తవానికి 30-35 శాతం కూడా రుణమాఫీ కాలేదని, రైతులు ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ‘ఎవడన్న వింటే తెలంగాణ పజీత పోద్ది. ఎక్కడైనా సీఎం అనేవాడు నా మంత్రులు నాకు వింటలేరు. నన్ను పనిచేయనిస్తలేరు’ అని అంటారా? ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు నా మాట వింటలేరు’ అని అంటరా? ఇంతకన్నా పరువుపోయే ముచ్చట ఇంకోటి ఉంటదా?’ అని నిప్పులు చెరిగారు.
తన రాజకీయ జీవితంలో ఇంత తెలివి తక్కువ పాలనను చూడలేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. రైతులు, మహిళలు, వృద్ధులు, ఆటోడ్రైవర్లు, ఆఖరుకు గురుకులాల విద్యార్థులు కూడా ఆగమయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ‘మనం ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ నాయకత్వంలో గురుకులాలను అద్భుతంగా నడిపినం. గురుకులాల్లో చదివిన మన బిడ్డలు ఉన్నతాధికారులుగా తయారైండ్రు. ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్, నిట్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు సంపాదించిండ్రు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో బంగారు, వెండి పతకాలు సాధించిండ్రు’ ఆయన వివరించారు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగని రోజంటూ లేకుండా పోయిందని వాపోయారు. 14 నెలల కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా 57 మంది అమాయక విద్యార్థులు చనిపోయారని, ఇందుకోసమా? తెలంగాణ తెచ్చుకున్నది అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో మొదటి త్రైమాసికానికే రెవెన్యూలాస్ రూ.15 వేల కోట్లు ఉన్నదని, అది రూ.30 వేల కోట్లకు చేరుతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారని ఇంత హీనమైన పాలన ఇంకెక్కడా ఉండదని కేసీఆర్ విమర్శించారు. పదేండ్లు అద్భుతంగా పాలించామని, ఏనాడూ ఈ దుస్థితి ఎదురుకాలేదని చెప్పారు. రాష్ట్రంలో అన్ని రంగాలు పడకేశాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎక్కడైనా ప్రభుత్వాలు మారినప్పుడు గత పాలన కంటే మెరుగ్గా చేయటం, లేదా వాటినే కొనసాగించటం ఆనవాయితీ అని, కానీ, రాష్ట్రంలో అదేమీ లేదని చెప్పారు. సంపద సృష్టించి ప్రజలకు పంచామని చెప్పారు. 2014 నుంచి 2023 దాకా పదేండ్లపాటు తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్తు వినియోగంలో దేశ సగటు కన్నా అనేక రెట్లు ముందున్న విషయాన్ని ఆయన వివరించారు. అయితే, ఇటీవల రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆర్బీఐ, కాగ్ లెక్కలను బీఆర్ఎస్ సాధించిన విజయాలను వెల్లడించి, వాటిని వెబ్సైట్లో పెట్టి చివరికి నాలుక కరచుకొని వాట్లోంచి తొలగించారని చెప్పారు. వెబ్సైట్లోంచి అయితే తొలగించారు కానీ, ప్రజల జీవితాల నుంచి జీవిక నుంచి వాస్తవాలను చెరిపేయలేరనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు.