హనుమకొండ సబర్బన్, ఆగస్టు 14: ఎన్పీడీసీఎల్లో పూర్తి సాంకేతికతను ఉపయోగిస్తూ ఏర్పాటు చేసిన మానవ రహిత సబ్స్టేషన్లను విద్యుత్తు శాఖ అధికారులు బుధవారం అందుబాటులోకి తెచ్చారు. హనుమకొండలోని నక్కలగుట్ట, వరంగల్ ఏజే మిల్లు గ్రౌండ్ వద్ద వీటి సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 30 వరకు హనుమకొండ, వరంగల్‌లో దాదాపు 20 సబ్స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.
సబ్‌స్టేషన్‌కు సంబంధించిన ఏ సమాచారమైనా స్కాడా సెంటర్‌కు వస్తుందని, అక్కడ ఉన్న టెక్నికల్ టీం దీనిని పర్యవేక్షిస్తుందని వివరించారు. ఎలాంటి ట్రిప్పింగ్ జరిగినా వెంటనే అలారంతో కూడిన సమాచారం వస్తుందని, టీం సభ్యులు అప్రమత్తమై ఆన్ చేస్తారని తెలిపారు. ఒకవేళ బ్రేక్ డౌన్ అయినా.. వెంటనే సంబంధిత ఇంజినీర్‌కు, స్కాడా సెంటర్‌కు సమాచారం అందుతుందని చెప్పారు. రోజురోజుకూ మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించడానికి, అంతరాయాలను కనిష్ఠ స్థాయికి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నట్టు సీఎండీ తెలిపారు.