బొల్లారం, నవంబర్ 4: నారాయణ కళాశాల క్యాంపస్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. బొల్లారం సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా గరిమెళ్లపల్లికి చెందిన బాలబోయిన పరుశురామ్ కూతురు వైష్ణవి (16) కాజిపల్లి శివారులోని నారాయణ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ఫస్టియర్ చదువుతున్నది. కళాశాల హాస్టల్లో సోమవారం సాయంత్రం ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది. కళాశాల యాజమాన్యం గుర్తించి బాచుపల్లిలోని ఓ దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. సీఐ గంగాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.