ములుగు, అక్టోబర్ 23 (నమస్తేతెలంగాణ): భార్యాభర్తల గొడవలో కాంగ్రెస్ నాయకులు తలదూర్చి భర్తపై దాడి చేయడంతో మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని మల్లంపల్లిలో బుధవారం చో టుచేసుకున్నది. బాధితుడితోపాటు స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దుమాల రాజేశ్‌కు భార్యతో గొడవ జరగ్గా 20 రోజుల క్రితం అదే గ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. మంగళవారం రాత్రి గ్రామంలోని బాలవికాస వాటర్ ప్లాంట్ వద్ద తన ఇద్దరు పిల్లలు కనిపించగా వారిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా కొందరు అడ్డుకున్నారు. దీం తో అతను అత్తగారి ఇంటి వద్దకు వెళ్లి గొడవ చేస్తున్న క్రమంలో ల్యాద శ్యామ్‌రావు, గోపి వచ్చి రాజేశ్‌పై దాడి చేశారు. తీవ్ర మనస్తాపం చెందిన రాజేశ్.. తన చావుకు గోపి, ల్యాద శ్యామ్‌రావు, బక్కి నాగరాజు కారణమంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మం దు తాగాడు. ఈ వీడియోను ‘మన మల్లంపల్లి’ అనే గ్రామ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టుచేయగా వైరల్‌గా మారింది. రాజేశ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎం దవాఖానకు తరలించారు. రాజేశ్‌పై దాడి చేసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారేనని స్థానికులు తెలిపారు. అధికారం ఉందనే అహంకారంతో ఇలా దాడి చేయడం సరికాదని పేర్కొన్నారు.