హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : నదీ జలాలపై శనివారం అసెంబ్లీలో ప్రదర్శించిన పీపీటీతో (పవర్ పాయింట్ ప్రజెంటేషన్) ప్రభుత్వంలో మంటలు చెలరేగినట్టు తెలుస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య ఆధిపత్యపోరు మరోసారి బహిర్గతం అయ్యిందనే చర్చ జరుగుతున్నది. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై పీపీటీ ఎవరు ప్రదర్శించాలనే అంశంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. సంబంధిత శాఖ మంత్రిగా పీపీటీ తన బాధ్యతని ఉత్తమ్ చెప్పగా, సభానాయకుడిగా తానే ప్రదర్శన ఇస్తానని సీఎం అన్నట్టు సమాచారం.
20 నిమిషాల వాగ్వాదం..45 నిమిషాలు ఔటాఫ్ కవరేజ్?
శనివారం అసెంబ్లీ కొనసాగుతుండగానే సుమారు మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి తన చాంబర్‌కు వచ్చారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అక్కడికి వెళ్లినట్టు సమాచారం. ఇద్దరి మధ్య దాదాపు 20 నిమిషాలపాటు జరిగిన చర్చలు క్రమంగా వాగ్వాదానికి దారి తీసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రి ఉత్తమ్ విసురుగా లేచి వెళ్లిపోయినట్టు అసెంబ్లీ లాబీల్లో చర్చ జరుగుతున్నది. సీఎం చాంబర్ నుంచి తన చాంబర్‌కు వచ్చిన ఉత్తమ్ దాదాపు 45 నిమిషాల పాటు ఎవరినీ కలువకుండా ఒంటరిగా గడిపారట. ఈ సమయంలో ఢిల్లీకి ఫోన్లు చేసినట్టు, చివరకు సీఎం రేవంత్‌రెడ్డి వెనక్కి తగ్గి, ఉత్తమ్‌కే పీపీటీ అవకాశం ఇచ్చినట్టు అసెంబ్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మైలేజ్ మీ ఒక్కడికేనా?
సీఎం, మంత్రి మధ్య వాగ్వాదం సందర్భంగా పలు అంశాలు తెరమీదికి వచ్చినట్టు సమాచారం. ఈనెల 1న ప్రజాభవన్‌లో తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ప్రజలు చూడకుండా ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపించారని సీఎంపై మంత్రి సీరియస్ అయినట్టు తెలుస్తున్నది. ‘మేం మీ గుమస్తాలు అనుకుంటున్నారా? రోజులకు రోజులు కష్టపడి ప్రిపేరై, గంటన్నరపాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే కేవలం 8నిమిషాలు మాత్రమే లైవ్ ఇస్తారా?’ అంటూ గట్టిగానే నిలదీసినట్టు వినికిడి. దీంతో సీఎం ఆత్మరక్షణలో పడి ఇందులో తన ప్రమేయం లేదని, తననెందుకు అనుమానిస్తున్నారని సర్ది చెప్పే ప్రయత్నం చేయగా, మీ ప్రమేయం లేకపోతే కీలకమైన ప్రజెంటేషన్ ఆపిన ఐ అండ్ పీఆర్ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఉత్తమ్ సీఎంను ప్రశ్నించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తన ప్రజెంటేషన్ రాకుండా మీ స్పీచ్ మాత్రమే ఎట్లా వచ్చిందని సీఎంను నిలదీయడమే కాకుండా, మైలేజ్ కేవలం మీ ఒకడికే కావాలా? అంటూ మంత్రి ఉత్తమ్ చిందులు తొకినట్టు గుసగుసలు వినవస్తున్నాయి.