వరంగల్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మేధావులు, వివిధ రాజకీయ పక్షాలు నోరుమెదపకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆర్టీసీ కార్మికులు 2019లో సమ్మె చేశారు. కరీంనగర్ డిపోకు చెందిన డ్రైవర్ బాబు అక్టోబర్ 30న గుండెపోటుతో మృతిచెందారు. నవంబర్ 1న ఎంపీ బండి సంజయ్, బీజేపీ కార్యకర్తలు బాబు మృతదేహంతో కరీంనగర్లో ధర్నా నిర్వహించారు. అంత్యక్రియల ర్యాలీలో హడావుడి చేశారు.
మరి రాష్ట్రంలో రెండు రోజులుగా జరుగుతున్న సమ్మెకు బండి సంజయ్ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని, శంకర్‌గౌడ్ విషయంలో ప్రకటనలకే ఎందుకు పరిమితం అయ్యారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపడం ప్రతి ఒక్కరి హక్కు అని అప్పుడు నీతిసూత్రాలు వల్లించిన కోదండరాం ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని నిలదీస్తున్నారు. సమ్మెపై సర్కార్ మౌనం దాల్చటం సరికాదని, ప్రజాస్వామ్య విలువలు, పౌరుల కర్తవ్యాలు అంటూ నీతిమాటలు చెప్పిన మేధావివర్గం అంతా ఇప్పుడెక్కడ దాక్కున్నది? నర్సంపేటలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ వారి కండ్లకు కనిపించడం లేదా? ‘అయింది ఆకున..
కానిది కంచాన’ పెట్టినట్టు వ్యవహరిస్తున్నారా?.. గురువారం వరంగల్ ఎంజీఎం దవాఖానలో ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు వేస్తున్న ప్రశ్నలివి. కేసీఆర్ హయాంలో ఆర్టీసీ కార్మికులను సమ్మెకు ఉసిగొలిపిన మేధావులు రెండురోజులుగా మాట మాత్రంగానైనా స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎర్రటి ఎండలో మలమల మాడుతూ, సమ్మెబాట పట్టిన ఆర్టీసీ కార్మికులకు స్వయంప్రకటిత మేధావి వర్గం కనీసం సంఘీభావం ప్రకటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మెబాట పట్టిన తమకు సంఘీభావం ప్రకటించకపోగా, సమ్మె చేయటమే అన్యాయం అన్నట్టుగా కొంతమంది వ్యవహరిస్తున్నారని ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు తుదిరూపం ఇచ్చే బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, ఇందుకు సంబంధించిన విధివిధానాలను బిల్లులోనే పొందుపరిచారు.
అయితే ఈ బిల్లుపై గవర్నర్ సంతకం చేయకుండా, గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చివరిదశకు తీసుకొచ్చిన ప్రక్రియను పూర్తిచేయాలని మాత్రమే తాము అడుగుతున్నామని పేర్కొంటున్నారు. బ్రెడ్ విన్నర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, అద్దె బస్సు డ్రైవర్లను సంస్థలో విలీనం చేయాలని, సంస్థ ప్రైవేటీకరణ యోచనను విరమించుకోవాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించాలని, ఉచితబస్సు పథకంతో ప్రతి నెలకూ జరిగే రూ.400 కోట్ల నష్టాన్ని ప్రభుత్వం భరించడంతోపాటు ఇప్పటివరకు ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, తదితర 32 డిమాండ్లపై సమ్మెబాట పట్టినట్టు చెప్తున్నారు. ఆర్టీసీ బలోపేతానికి, భావితరాలకు ఆర్టీసీని అందించేందుకు తాము అడుగుతున్నవి న్యాయమైన డిమాండ్లు కావా? అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
కోదండరాంకు ఆర్టీసీ కార్మికుల సమ్మె సమ్మతమా కాదా? అని ఆర్టీసీ కార్మికులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ సర్కార్‌పై నాడు ప్రజల్లో వ్యతిరేకతను కూడగట్టడమే పనిగా పెట్టుకున్న కొంతమంది రిటైర్డు ఐఏఎస్ అధికారులు ఇప్పుడు నోరు మెదపడం లేదని విమర్శిస్తున్నారు. ‘అప్పుడు బాగా వినిపించిన మురళీగాన శబ్దం.. ఇప్పుడు నిశ్శబ్దం అయిపాయే?’ అని ఎద్దేవా చేస్తున్నారు.
రేవంత్ సర్కార్‌పై తమ వీరవిధేయతకు మచ్చవచ్చి, తద్వారా తమకు కలిగే వ్యక్తిగత ప్రయోజనాలకు ఎక్కడ విఘాతం కలుగుతాయేమోననే భయం ఆ మేధావులను వెంటాడుతున్నట్టు ఉన్నదనే వాదన వినిపిస్తున్నది. కనీస మానవీయ స్పందనకైనా తాము నోచుకోలేకపోయామా? అని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏది చేసినా తప్పు.. కాంగ్రెస్ హయాంలో ఏది చేసినా ఒప్పు అన్నట్టు వ్యవహరించడం దౌర్భాగ్యమని ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు విమర్శిస్తున్నాయి. రాజకీయ పక్షపాతాన్ని, స్వార్థ ఎజెండాను పక్కనపెట్టకపోతే వారి పట్ల తమ వైఖరిని ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.