హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : తిరుమలకు వెళ్లే భక్తులందరికీ బీమా సదుపాయం కల్పించాలని టీటీడీ భావిస్తున్నది. రోజూ సుమారు లక్ష మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తుంటారు. ఘాట్రోడ్లు, అలిపిరి, శ్రీవారి మెట్టు, క్యూలైన్లు ఇతర ప్రదేశాల్లో భక్తులు మరణించడం, ప్రమాదాల బారినపడటం, నడకమార్గంలో అడవి జంతువుల దాడికి గురికావడం లాంటి ఘటనల నేపథ్యంలో భక్తులకు బీమా కల్పించే యోచన చేస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.
పాలకవర్గానికి ప్రతిపాదనలు పంపించినట్టు చెప్పారు. ప్రస్తుతం తిరుమలలో ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి టీటీడీ రూ.3 లక్షల పరిహారం చెల్లిస్తున్నది. ఇప్పుడు అలిపిరి-తిరుమల మార్గం లో వచ్చే భక్తులకు కూడా బీమా కల్పించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు.