ఏదైనా కారణంతో రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా కేసీఆర్ అమలు చేసిన రైతు బీమా.. కాంగ్రెస్ పాలనలో నిర్వీర్యమవుతున్నది. ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాలు సాయం కోసం నిరీక్షించాల్సి వస్తున్నది
వికారాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ఏ కారణంతోనైనా రైతు మృతి చెందితే, ఆయా రైతు కుటుంబాలు వీధినపడకుండా, వారికి అండగా నిలిచేలా కేసీఆర్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన రైతుబీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో కేవలం వారం రోజుల్లోనే మృతిచెందిన రైతు తరఫు కుటుంబ సభ్యుల(నామినీ) బ్యాంకు ఖాతాల్లో రూ.5 లక్షల బీమా సాయం జమ అయ్యేది. కానీ, ప్రస్తుతం రైతుబీమా సాయం కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతు కుటుంబాలు.. బీమా సాయం కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. దీంతో క్షేత్రస్థాయిలో అధికారులను బాధిత కుటుంబాలు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఒక్క వికారాబాద్ జిల్లాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 900 మంది రైతులు మృతి చెందగా, వీరిలో 200 మంది రైతులు నాలుగైదు నెలలుగా రైతుబీమా సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో 213 కోట్ల బీమా సహాయం
వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో 4,262 మంది రైతులు మరణించగా, ఆయా కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.213.1 కోట్ల పరిహారం అందింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 786 మంది రైతు కుటుంబాలకు రూ.39.30 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 812 కుటుంబాలకు రూ.40.60 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. 2020-21లో 1,201 కుటుంబాలకు రూ.60.05 కోట్లు, 20 21-22లో 1,047 కుటుంబాలకు రూ.52.35 కోట్లు, 2022-23లో 416 కుటుంబాలకు రూ.20.8 కోట్ల బీమా సహాయాన్ని నేరుగా సంబంధిత రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.