KCR | హైదరాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ) : ఏపీ సర్కారు చేస్తున్న నదీ జలాల దోపిడీని ఎదిరించేందుకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వయంగా కదనరంగంలోకి దిగారు. ఏపీ జలదోపిడీ, కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల సహకారంపై జంగ్ సైరన్ మోగించారు. ఉద్యమ కార్యాచరణ రూపకల్పనపై లోతుగా చర్చించేందుకు బీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులతో ఆదివారం తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయం, వివిధ సందర్భాల్లో తాను అప్పటి ప్రభుత్వాలపై ఎదిరించిన తీరు, చివరికి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ సాధన, అనంతరం బీఆర్ఎస్ హయాంలో పదేండ్ల సమ్మిళిత అభివృద్ధిని పార్టీ శ్రేణులకు కేసీఆర్ గుర్తుచేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో తెలంగాణకు అన్ని అంశాల్లో అన్యాయం జరుగుతున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్రం వాపస్ పంపితే.. కాంగ్రెస్ సరార్ మౌనంగా ఉన్నది? నదీ జలాల కోసం ఢిల్లీకి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలి. కానీ, ఎవరూ పట్టించుకోకపోవడం, కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీలు ఎంపీలు అడ్డుకోకపోవడంతో రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయం చూసి సహించలేక తాను బయటకు రావాల్సి వచ్చిందని కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వానికి రెం డేండ్ల పాటు సమయం ఇచ్చి మౌనంగా ఉన్నానని, ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకనుంచి ఒక లెక్క.. చుక్కనీటిని కూడా వదులుకోబోమని ఘాటుగా కేసీఆర్ హెచ్చరించినట్టు సమాచారం.
రెండేండ్లలో రూపాయి కేటాయించలేదు
రాష్ర్టాన్ని 50ఏండ్లు పాలించిన కాంగ్రెస్, 20 ఏండ్ల పాలించిన తెలుగుదేశం పార్టీలు తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం చేశాయని, తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కాదు.. తెలంగాణ వెనకి నెట్టివేయబడ్డ ప్రాంతమని కేసీఆర్ గుర్తుచేసినట్టు తెలిసింది. ‘పాలమూరు జిల్లాకు ఈ రెండు ప్రభుత్వాలు తీరని ద్రోహం చేశాయి. జిల్లా ప్రజలు ముంబైకి వలసలు వెళ్లేలా, గంజికేంద్రాలు నిర్వహించేలా చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణకు పెనుశాపంగా పరిణమించింది. ఉమ్మడి ఏపీలో అత్యంత వివక్షకు గురైన జిల్లా మహబూబ్‌నగర్. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 6.5 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చాం. నాడు ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 170 టీఎంసీలు ప్రతిపాదిస్తే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు 45 టీఎంసీలు కాంగ్రెస్ చాలంటున్నది. 90శాతం పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టుకు రెండేండ్లలో కాంగ్రెస్ సర్కారు రూపాయి కూడా కేటాయించలేదు. ఫలితంగా పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు తీరని అన్యాయం చేసింది. కాంగ్రెస్ అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని కేసీఆర్ పిలుపునిచ్చినట్టు తెలిసింది.
మూడు జిల్లాల్లో సభలు పెడుదాం
కాంగ్రెస్ సర్కారు చర్యలతో అన్యాయానికి గురవుతున్న పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో సభలు పెట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. ‘మూడు జిల్లాల రైతాంగానికి, తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయన్ని గడపగడపకు తీసుకెళ్లాలి. గ్రామాల వారీగా నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు చేపట్టాలి. మండలాలు, డివిజన్ కేంద్రాల్లోనూ నిరసనలు, ఆందోళనలు చేపట్టాలి. ఇందుకుగాను తొలుత కరపత్రాలు, వాల్‌పోస్టర్లు ముద్రించండి. కొన్ని ప్రత్యేక పాటలు సిద్ధం చేయండి. ఆ పాటల సీడీలు అతి త్వరలోనే బయటకు రావాలి. సోషల్ మీడియాలో వైరల్ కావాలి. సాగునీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సోషల్ మీడియాలో చర్చ జరగాలి. నియోజకవర్గాలవారీగా రిటైర్డ్ అధికారులు డిబేట్లు పెట్టాలి. ఆ తర్వాత మూడు జిల్లాల్లో వేర్వేరుగా సభలు నిర్వహించాలి. జిల్లాలోని ప్రజలందరూ వచ్చేలా సెంటర్ పాయింట్‌ను గుర్తించండి. త్వరలోనే ఆయా జిల్లాల నేతలతో మరోసారి చర్చించి భారీ బహిరంగ సభలు త్వరలోనే పెట్టుకుందాం. నేనే స్వయంగా వచ్చి సభలో మాట్లాడుతా. ఏపీ జల దోపిడీకి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు, కేంద్రంలోని మోదీ సర్కారు ఎలా సహకరిస్తున్నాయో ప్రజలకు వివరిద్దాం. తెలంగాణపై మనకు తప్ప ఇతరులు ఎవరికీ ఆర్తి, ఆరాటం లేదు’ అని అధినేత కేసీఆర్ చెప్పినట్టు సమాచారం.
త్వరలోనే సభ్యత్వ నమోదు
త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని సమావేశంలో అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్టు తెలిసింది. ఇది డిజిటల్ యుగం కాబట్టి ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో రెండు రకాలుగా సభ్యత్వాలు ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. సభ్యత్వ నమోదు క్యాంపెయిన్‌పై అభిప్రాయాలు చెప్పాలని కేసీఆర్ కోరినట్టు తెలిసింది. సుమారు 45 నిమిషాలపాటు సభ్యత్వ నమోదుతోపాటు ఇతర అంశాలను కూడా నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. సాధారణ సభ్యత్వం, క్రియాశీలక, శాశ్వత సభ్యత్వం ఉండాలని కొందరు అభిప్రాయపడినట్టు సమాచారం. గతంలో మాదిరిగా సాధారణ సభ్యత్వానికి రూ.50, క్రియాశీలా సభ్యత్వానికి రూ.100 రుసుము విధించాలని సూచించినట్టు తెలిసింది. ‘సభ్యులుగా చేరినవారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు పార్టీ నేతలతో లైవ్ కాంటాక్ట్‌లో ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆలోచించాలి. ప్రస్తుతం ఎమ్మెల్యే కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నందున గ్రామ, మండల, కమిటీల మీటింగ్ పెడితే అందరూ యాక్టివ్ అవుతారు’ అని పలువురు అభిప్రాయాలు చెప్పినట్టు తెలిసింది.
45 నిమిషాలపాటు అభిప్రాయ సేకరణ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, సర్పంచ్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ఎల్పీ, పార్టీ పార్లమెంటరీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గంతో సమావేశమైన కేసీఆర్.. వారి నుంచి వివిధ అంశాలపై సుదీర్ఘంగా అభిప్రాయ సేకరణ చేసినట్టు తెలిసింది. సుమారు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో సుమారు గంట పాటు ప్రతి ఒక్కరి నుంచి సభ్యత్వ నమోదు క్యాంపెయిన్, నదీ జల్లాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం చేపట్టబోయే కార్యాచరణ ఎలా ఉండాలి? అనే అంశాలపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్నట్టు సమాచారం. సభలు, నిరసనలు, ఆందోళనలు, పాటలు, కాంగ్రెస్ పాలనపై తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారనే అంశాలను అధినేత దృష్టికి నేతలు తీసుకొచ్చినట్టు తెలిసింది.
‘నమస్తే తెలంగాణ’ భూపాలుడి కథనంపై చర్చ
‘నమస్తే తెలంగాణ’లో ఆదివారం ‘భూపాలుడు.. భేతాళుడు’ శీర్షికన ప్రచురితమైన కథనాన్ని సమావేశంలో అధినేత కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలిసింది. ప్రత్యేక కథనం అద్భుతంగా ఉన్నదని కొనియాడినట్టు సమాచారం. ‘మన ప్రభుత్వానికి, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని పాయింట్ల వారీగా చాలా బాగా రాశారు.. మీరు కథనం చదివారా?’ అని కేసీఆర్ అడిగినట్టు తెలిసింది. కథనంలో పేర్కొన్నట్టుగా మనకు తెలంగాణ మట్టిపై ఆరాధన, రైతుపై అవ్యాజ్యమైన ప్రేమ ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం భూములు అమ్ముకోడమే లక్ష్యంగా
పాలసీలను రూపొందిస్తుందని కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది.