శాయంపేట, నవంబర్ 5 : తుపాన్‌తో పంటలు నష్టపోయి నాలుగు రోజులైనా ఒక అధికారి, ప్రజాప్రతినిధి ఎందుకు పరిశీలించలేదని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి (Madhusudhana Chary) ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ.. కళకళలాడుతున్న తెలంగాణను బంగారు పళ్లెంలో ఇస్తే కాంగ్రెస్ సరార్ వల్లకాడులా మార్చిందని ధ్వజమెత్తారు.
పత్తి, వరి, మిరప, ఇతర పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయని, వ్యవసాయ అధికారులు ఒకరూ పరిశీలించడానికి రాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టర్, వ్యవసాయ అధికారులు వెంటనే పంట నష్టాన్ని పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతులు పంటలు నష్టపోయి బాధపడుతూ ఉంటే రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒక అవకాశం ఇవ్వమని సీఎం రేవంత్‌రెడ్డి అడుగుతున్నారని, ఇప్పటికే రాష్ట్ర ప్రజలను అథోగతి చేశారని, ఇంకా జూబ్లీహిల్స్‌లో గెలిపిస్తే తమను నిలువునా ముంచుతారని ప్రజలు ఆలోచిస్తున్నట్టు తెలిపారు.