సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 12: రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ రూ.14 వేల రైతు భరోసా నిధులను రైతులకు ఎగ్గొట్టిందని, వాటినే రుణమాఫీ చేశామని బొంకుతున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. వానకాలం రూ.9 వేల కోట్లు, ఈ యాసంగి రూ.5 వేల కోట్ల చొప్పున రైతుభరోసా నిధులను ఎగ్గొట్టిందని విమర్శించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు, చిన్నకోడూర్ మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను శనివారం ఆయన పరిశీలించారు. బాధిత రైతులను ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ నాడు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ రైతుబంధు నగదు పడ్డాయని, కానీ ఈ ప్రభుత్వం సర్వే నంబర్లలో ఎక్కువ భూమి ఉన్నదన్న సాకుతో రైతుబంధు ఆపుతున్నారని మండిపడ్డారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కేసీఆర్ రైతుబంధు ఆపలేదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పంటనష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.25 వేల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, ఉచితంగా విత్తనాలను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటలు నష్టపోయిన కౌలురైతులకూ వీటిని వర్తింపజేయాలని కోరారు. గత మూడు నెలలుగా బాధిత కుటుంబాలకు రైతుబీమా ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. వెంటనే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంటల బీమా చేస్తామని అసెంబ్లీలో చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయకుండా రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని, ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది మరో నిదర్శనమని పేర్కొన్నారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య మృతికి హరీశ్‌రావు సంతాపం తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. అలాంటి చెట్లు పెంచే రామయ్య మరణానికి, చెట్లను నరికే రేవంత్‌రెడ్డి సంతాపం చెప్పడమంటే హంతకుడే సంతాపం తెలిపినట్టు ఉన్నదని పేర్కొన్నారు. హార్టికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల్లో, హెచ్‌సీయూలో 150 ఎకరాల్లో చెట్లను నరికించాడని విమర్శించారు. రేవంత్‌రెడ్డి దుందుడుకు, తప్పుడు పనుల వల్ల అధికారులు బలయ్యే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
వడగండ్ల ధాటికి నష్టపోయిన పంటపొలాలను పరిశీలించిన హరీశ్‌రావు.. బాధిత రైతులను ఓదారుస్తూ ముందుకు సాగారు. చిన్నకోడూరు మండలంలో కరీంనగర్ రోడ్డు ఇబ్రహీంనగర్ ఇడ్లి బండి వద్ద మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు రైతులతో కలిసి టిఫిన్ చేశారు. రైతులను, స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ, వారితో ముచ్చటిస్తూ వారితో సరదాగా కొద్దిసేపు గడిపారు. కామన్ మ్యాన్‌గా, సింపుల్‌గా తమ పకనే కూర్చొని టిఫిన్ చేయడంతో రైతులు, స్థానికులు ఆనందం వ్యక్తంచేశారు.