మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ (Mahabubnagar) ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటుచేసుకున్నది. ఫుడ్ పాయిజన్‌తో మాగనూర్ పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం వారికి అల్పాహారం అందించిన కిచిడీలో పురుగులు కనిపించడంతో అవాక్కయ్యారు. దవాఖాన సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వారికి బీఆర్ఎస్ నేత ఆశిరెడ్డి మద్దతు పలికారు. హాస్పిటల్‌కు తీసుకొచ్చిన ఆహార పదార్థాలను పరిశీలించారు. విద్యార్థులు చావుబతుకుల మధ్య ఉంటే ఇలాంటి ఆహారం అందించడం ఏంటని ప్రశ్నించారు.
బుధవారం మాగనూరు జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజన వికటించి 15 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత అయింది. పరిస్థితి విషమించడంతో వారందరిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సాక్షాత్తు సీఎం విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించినప్పటికీ హాస్పిటల్ సిబ్బంది మాత్రం పురుగుల అన్నం పెట్టి తమ పైశాచిక నైజాన్ని బయట పెట్టుకున్నారు. గురువారం ఉదయం హాస్పిటల్లో బాధిత విద్యార్థులను మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిలు పరమర్శించారు. ఈ సందర్భంగా ఉదయం ఆపిల్ ఫ్రూట్స్ ఇచ్చిన వైద్య సిబ్బంది.. కొద్దిసేపటికే కిచిడీ అల్పాహారాన్ని పంపించారు. అల్పాహారంలో పురుగులు కనబడటంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపణలు వస్తున్నాయి.