కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలం దుర్షేడులో రాజీవ్ రహదొరిపై యూరియా కోసం రైతులు, మహిళా రైతులు వినూత్న రీతిలో బతుకమ్మల ఆటలాడుతూ నిరసన తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఈరోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కారణంగానే రైతులకు యూరియా కష్టాలు వచ్చాయని అన్నారు. వరి పొట్టకు వచ్చే దశలో యూరియా తప్పనిసరి అవసరమవుతుందని, ఇలాంటి కీలక సమయంలో రైతులకు యూరియా సరఫరా చేయకుంటే దిగుబడి తగ్గి రైతులు నష్టపోయే పరిస్థి వస్తుందని అన్నారు.
అసమర్ధత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా, కనీసం పొటాష్ కూడా అందుబాటులో లేని దుస్థితి వచ్చిందన్నారు. యూరియా రైతులకు దొరక్కుండా బ్లాక్ మార్కెట్కు తరలించారని ఆరోపించారు. యూరియా కోసం గ్రామాలు కదిలి రావడం, మహిళా రైతులు సైతం రోడ్డెక్కడం, బతుకమ్మ ఆడడం, దురదృష్టకరమన్నారు. రైతులు సొసైటీల దగ్గర క్యూ లైన్ లో యూరియా కోసం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు. ఈ దుస్థితికి కారణం వందశాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమన్నారు.
ఈ కారణంగా సామాన్య రైతులకు తీవ్రమైన పంట నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లోగా యూరియాను రైతులకు సరఫరా చేయని పక్షంలో బ్లాకు గోదాముల కొల్ల కొట్టేందుకు కూడా సిద్ధమేనన్నారు. రైతులకు ఏమాత్రం పంట నష్టం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. ఈ సందర్భంగా మహిళా రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి బతుకమ్మ ఆడారు. రాజీవ్ రహదారి పూర్తిగా స్తంభించిపోయింది. జిల్లా వైయవసాయ అధికారి రావాలని రైతులు డిమాండ్ చేశారు. యూరియా బస్తాలు చేత పట్టుకుని ప్రదర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.