తాడ్వాయి, జనవరి19 : ఏజెన్సీ ప్రాంతంలోని సమ్మక్క, సారలమ్మ కొలువైన మేడారంలో తొలిసారి క్యాబినెట్ మీటింగ్ జరిగిందని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం దీని వల్ల ఆదివాసీలకు ఏం ఒరిగిందో చెప్పాలని గోండ్వానా దండాకారణ్య పార్టీ నాయకుడు గుండు శరత్ ప్రశ్నించారు. సోమవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వనదేవతలను దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి మేడారం పర్యటన కేవలం వ్యక్తిగతమని ఎద్దేవా చేశారు.
మేడారంలో జరిగిన సమావేశంలో ఏజెన్సీ ప్రాంతంలోని సమస్యలు తెలుసుకునేందుకు ఆదివాసీ సంఘాలకు సమయం కేటాయించకపోవడం దారుణమని మండిపడ్డారు. క్యాబినెట్ మీటింగ్ హైదరాబాద్లో జరిగినా మేడారంలో జరిగినా ఒక్కటే అని చెప్పారు. ఆదివాసీగిరిజనులకు ఈ మీటింగ్తో ఏం ప్రయోజనం చేకూరిందో మంత్రి సీతక్క తెలుపాలని డిమాండ్ చేశారు.