Congress Govt | ఖైరతాబాద్, జూన్ 17 : కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మాట్లాడటమే తప్ప ఆచరించిన దాఖలాలు లేవని, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలోనూ కులగణన సక్రమంగా జరగలేదని వక్తలు విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బీసీల జనాభా లెక్కలు బయటకు రాకుండా అడ్డుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీయేనని దుయ్యబట్టారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘స్థానిక సంస్థల ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్లు.. భవిష్యత్ కార్యాచరణ’ అనే అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మాటవరుసకే బీసీ అని అంటున్నదని, ఆచరణలో మొండిచేయి చూపుతున్నదని విమర్శించారు.
గత సంవత్సరం చేపట్టిన కులగణనలోనే ప్రభుత్వ చిత్తశుద్ధి తెలిసిపోయిందని, అంతా తప్పుల తడకగా చేశారని మండిపడ్డారు. బీసీల గురించి మాట్లాడే ముందు కులగణన రిపోర్టు ఎందుకు బయటపెట్టడంలేదని ప్రశ్నించారు. 61% ఉన్న బీసీ జనాభాను 56%గా చూపించడంలోనే కాంగ్రెస్ కుట్ర బయటపడిందని పేర్కొన్నారు. తమిళనాడు తరహాలో అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకుపోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉన్నదని చెప్పారు. కానీ కుట్రపూరితంగా అలాంటి అడుగులు వేయకుండా తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. మంత్రి పదవుల నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు అగ్రభాగం అగ్రవర్ణాలకే కట్టబెట్టారని, ఏడుగురు బీసీ మహిళా ఎమ్మెల్యేలు ఉంటే ఎంతమందికి పదవులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలందరూ ఏకతాటిపై నిలబడి రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో అంతా సీఎం రేవంత్‌రెడ్డి సామాజికవర్గానికే పెద్దపీట వేస్తున్నారని, సమాచార శాఖ, రెరా లాంటి ప్రతి పదవినీ వారికే కట్టబెడుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. బీసీలను మరోసారి దగా చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని ఆరోపించారు. బీసీలకు అన్యాయం జరిగితే ఏ మాత్రం సహించేది లేదని, ఆ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామని చెప్పారు. కుందారం గణేశ్‌చారి అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవులు, బీసీ సంఘాల నయాకులు కోల శ్రీనివాస్, ప్రొఫెసర్ నరేందర్, శేఖర్ సగర, బాలరాజుగౌడ్, మన్నారం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి నేటివరకు కాంగ్రెస్ పాలకులు బీసీలకు న్యాయం చేసిన దాఖలాలు లేవని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ప్రస్తుతం 42% రిజర్వేషన్ల అంశంపై కూడా బీసీలకు న్యాయం చేసే దిశగా ఆలోచనలు చేసినట్టు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఈ దేశంలో మొదటినుంచీ బీసీలపై భయంకరమైన కుట్రలు సాగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంఘాల ఒత్తిడి మేరకు కులగణన చేసినా ఆ వర్గాలను మరోసారి కుట్రపూరితంగా మోసం చేసే పనిలో ఉన్నదని మండిపడ్డారు. బీసీలను సంఘటితం చేసే క్రమంలో బీసీ సంఘాల వారు ఏ నిర్ణయం తీసుకున్నా కలిసి పనిచేస్తామని చెప్పారు. 42%రిజర్వేషన్లు అమలుచేసిన తరువాతే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేశారు.