సూర్యాపేట, జూలై 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా 11 ఏండ్లుగా జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసి రెగ్యులరైన 3,750 మంది అధ్యాపకులకు ప్రస్తుత బదిలీల్లో తీరని అన్యాయం జరుగుతున్నది. వారంతా 11 ఏండ్లుగా ఒకే చోట పని చేస్తున్నా ఉన్నత విద్యాశాఖ వారికి బదిలీల్లో అవకాశం కల్పించడంలేదు. 2013లో ఐదేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను బదిలీ చేసిన ఉన్నత విద్యాశాఖ.. రెగ్యులర్ అయ్యాక బదిలీ చేయకపోవడంపై వారిలో అసహనం నెలకొన్నది.
ఈ విషయమై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి నేతృత్వంలో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్-475 ఆధ్వర్యంలో ఉన్నత విద్యాశాఖ అధికారులను కలిసి వినతిపత్రాలు అందించినా స్పందన లేదు. బదిలీలపై నిషేధం ఎత్తేస్తూ ప్రభుత్వం జీవో 80 జారీ చేయగా.. దీని ప్రకారం కనీసం రెండు సంవత్సరాల సర్వీసు నిబంధన అమలు చేయాలి. జీవోలో స్పౌజ్, మెడికల్ క్యాటగిరీ ఉద్యోగులకు రెండు సంవత్సరాల నిబంధన వర్తించదని పేర్కొంది.
ఈ లెక్కన కాంట్రాక్ ్టబేస్డ్ నుంచి ఏడాది క్రితం రెగ్యులర్ అయిన స్పౌజ్, మెడికల్ గ్రౌండ్లో ఉన్న ఉద్యోగులంతా బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జీవో 80కి అనుబంధంగా ఉన్నత విద్యాశాఖ మరో జీవో 118ను తీసుకొచ్చింది. ఈ జీవోలో స్పౌజ్, మెడికల్ క్యాటగిరీ ఉద్యోగులకు అవకాశం కల్పించకపోవడంతో వెయ్యి మంది అధ్యాపకులు బదిలీ అవకాశం కోల్పోతున్నారు. మళ్లీ బదిలీల ప్రక్రియ ఎప్పుడు ఉంటుందో తెలియదని పేర్కొంటున్నారు.
11 ఏండ్లుగా ఒకే చోట కాంట్రాక్ట్ బేస్డ్గా పనిచేస్తూ ఏడాది క్రితం రెగ్యులర్ అయిన అధ్యాపకుల పట్ల ఉన్నత విద్యాశాఖ మానవీయ కోణంలో ఆలోచించి బదిలీలకు అవకాశం కల్పించాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్-475 రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సురేశ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ కోరారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో 80 ప్రకారమైనా కుటుంబాలకు దూరంగా ఉంటున్న స్పౌజ్, మెడికల్ క్యాటగిరీ ఉద్యోగులు బదిలీకి దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
హైదరాబాద్, జూలై18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాలయాల సొసైటీలో(టీజీఎంఆర్ఈఐఎస్)చేపట్టిన ఉపాధ్యాయులు, సిబ్బంది బదిలీలు, పదోన్నతుల్లో పారదర్శకత లోపించిందని టీజీ యూటీఎఫ్ మైనార్టీ విభాగం మండిపడింది. ప్రమోషన్లు, బదిలీల్లో ఏ ఒక్క ఉపాధ్యాయుడికి నష్టం జరిగినా ఊరుకోబోమని టీజీయూటీఎఫ్ అధ్యక్షుడు రాంబాబు, ప్రధాన కార్యదర్శి మహేశ్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
మైనార్టీ గురుకులాల్లో చేపట్టిన ప్రమోషన్లు, బదిలీలు గందరగోళంగా మారాయన్నారు. ఇటీవల విడుదల చేసిన జాబితా తప్పులతడకగా ఉందని, పదోన్నతులకు సంబంధించి తుది అర్హుల జాబితా ప్రకటించకపోవడమేంటని ప్రశ్నించారు. జేఎ ల్ క్యాడర్‌కు పదోన్నతులు, బదిలీలు చేపట్టి ఆ తర్వాత పీజీటీలకు జేఎల్‌గా పదోన్నతులు కల్పించాలని, మిగిలిన పీజీటీలకు బదిలీలు, టీజీటీలకు పీజీటీగా పదోన్నతి కల్పించి ఆ తర్వాత టీజీటీలకు బదిలీలు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు.
పద్ధతి లేకుండా సొసైటీ ఉన్నతాధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా సొసైటీ ఉన్నతాధికారులు బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను సవరించాలని, జాబితాలో తప్పిదాలను గుర్తించి ఆ తరువాతే ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు.