హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. ఫైల్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి చేరినట్టు తెలుస్తున్నది. ఆమోదం పొందిన తర్వాత మార్గదర్శకాలు విడుదల చేసి 15 రోజుల్లోపు బదిలీలు పూర్తి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒకేచోట కనిష్ఠంగా రెండేండ్లు పనిచేసినవారికి దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించాలని ప్రతిపాదించినట్టు తెలిసింది.
గరిష్ఠంగా నాలుగేండ్లు ఒకేచోట పనిచేసినవారిని కచ్చితంగా బదిలీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. ఈ బదిలీలతో స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖలో ప్రక్షాళన జరుగుతుందని చెప్తున్నారు. ఆయా శాఖల్లో కొందరు అధికారులు ఏండ్లుగా తిష్ట వేసుకొని పాతుకుపోయారు.