మోర్తాడ్, మే 23 : ఎగువ ప్రాంతం నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రారంభమైంది. మూడురోజులుగా 2,500 క్యూసెక్కులకుపైగా వరద వస్తున్నది. ఎండాకాలంలో ప్రాజెక్ట్‌లో నీరు డెడ్‌స్టోరేజీకి చేరుకుంటుందనుకునే తరుణంలో అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో ఇన్‌ఫ్లో వస్తున్నది. నెలరోజులుగా ప్రాజెక్టులో నీటిమట్టం నిలకడగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో ఉన్న నీటి నిల్వలు తాగునీటి అవసరాల కోసం అందించేందుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెప్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజూ తాగునీటికోసం నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు 231 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(80.5టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1061.30అడుగుల (11.781టీఎంసీలు)నీటి నిల్వ ఉన్నది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువకు 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 321 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తున్నది.