Nagagarjuna Sagar | నాగార్జున సాగర్ జలాశయానికి వరద పెరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. ఎగువ కురిసిన వర్షాలకు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు వరద రాగా.. డ్యామ్ జలకళను సంతరించుకున్నది. ఇప్పటికే జలాశయం నిండకుండను తలపిస్తున్నది. ప్రస్తుతం డ్యామ్‌కు 95వేల క్యూసెక్కులకుపైగా వరద వస్తుండగా.. అధికారులు ఆరుగేట్లను ఎత్తివేశారు. సాగర్ ప్రస్తుత, పూర్తి నీటిమట్టం 590 అడుగుల మేర నీరున్నది. ప్రస్తుతం, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలున్నది. అవుట్ ఫ్లో 95,469 క్యూసెక్కులుగా ఉన్నది.
క్రస్ట్ గేట్ల ద్వారా 48,600 క్యూసెక్కులు, పవర్‌హౌస్ ద్వారా 29,313 క్యూసెక్కులు, ఎల్ఎల్సీ ద్వారా 600 క్యూసెక్కులు, రైట్ కెనాల్ 7678 క్యూసెక్కులు విడుదలవుతున్నది. నాలుగు రోజుల కిందటి వరకు వరద ప్రవాహం రావడంతో 24 గేట్లు.. ఆ తర్వాత 18 గేట్లను ఎత్తి నీటి దిగువకు వదిలారు. దాంతో పరవళ్లను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో సాగర్‌కు క్యూ కట్టారు. ఆ తర్వాత ప్రవాహం తగ్గడంతో అధికారులు గేట్లను మూసివేశారు. తాజాగా వరద రావడంతో నిన్న రెండు గేట్లను ఎత్తగా.. గురువారం మరింత పెరిగింది. దాంతో ఆరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సెలవులు మొదలుకావడంతో సాగర్ వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉన్నది.