కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పల్లెల్లో కంటిమీద కునుకు లేకుండా పోయింది. భూసేకరణ పేరిట ఇప్పటికే పలు గ్రామాల ప్రజలు పోరుబాటలో ఉండగా, తాజాగా సిద్దిపేట జిల్లాలో మరో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. ఈ మేరకు 124 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం తాజాగా జీవోను విడుదల చేసింది. ఆయా భూముల్లో అప్పుడే ని‘బంధనాలు’ విధించింది. ఎలాంటి పనులు చేపట్టవద్దని, అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధించింది. దీంతో అక్కడి రైతుల్లో అలజడి మొదలైంది.
Industrial Park | హైదరాబాద్, జనవరి 30(నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం 124 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీచేసింది. హుస్నాబాద్ మండలం తోటపల్లితోపాటు అక్కన్నపేట మండలంలోని జనగాం, చౌటపల్లి గ్రామాల పరిధిలో 124.36 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. టీజీఐఐసీ ఆధ్వర్యంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం భూములు సేకరిస్తున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నది. భూమి ప్లాన్‌తోపాటు ఇతర వివరాలు కలెక్టరేట్‌తోపాటు హుస్నాబాద్ డివిజనల్ కార్యాలయంలో అందుబాటులో ఉన్నట్టు ప్రకటించారు.
ప్రజల అవసరాల నిమిత్తం ఈ భూముల్లో సర్వే నిర్వహణ, తవ్వకాలు జరపడం, బోర్లు వేయడం, నిర్మాణా లు చేపట్టడం తదితర పనులకు అధికారులకు అధికారం కల్పించినట్టు పేర్కొన్నారు. నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుంచి భూముల క్రయవిక్రయాలు, తాకట్లకు సంబంధించిన చర్యలు చేపట్టరాదని స్పష్టంచేశారు. అభ్యంతరాలు ఉన్నవారు నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుంచి 60 రోజుల్లోగా భూసేకరణ అధికారికి లిఖితపూర్వకంగా సమర్పించాలని కోరారు.
వికారాబాద్ జిల్లా లగచర్ల ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం సుమారు 1,100 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని న్యాలకల్ మండలం మాడ్గి, డప్పూర్, వడ్డి తదితర గ్రామాల పరిధిలో పరిశ్రమల కోసం 2,000 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో ఇండస్ట్రియల్ పార్క్ కోసం 567 ఎకరాలు, ఓఆర్ఆర్-ట్రిపుల్ ఆర్ మధ్య 100 మీటర్ల రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం రంగారెడ్డి జిల్లా యాచారం, కడ్తాల్, ఆమనగల్లు మండలాల పరిధిలో 554 ఎకరాల భూములను సేకరించేందుకు ఇదివరకే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిమ్జ్ కోసం గతంలోనే దాదాపు 12,000 ఎకరాలు సేకరించగా, ఇప్పుడు మరో 2,000 ఎకరాల సేకరణకు చర్యలు చేపట్టడంపై స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు.
ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం కోసం ఇంకా భూసేకరణ మిగిలే ఉండగా, దక్షిణ భాగం కోసం అలైన్‌మెంటు సిద్ధమయ్యాక భూసేకరణ చేపడతారు. అంతేకాదు, ఫార్మాసిటీని రద్దుచేసిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 10 ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో విలేజ్ 1000-2000 ఎకరాల విస్తీర్ణంలో ఉండనున్నదని ప్రకటించారు. దీన్నిబట్టి మరిన్ని భూసేకరణ నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశం ఉన్నదని స్పష్టమవుతున్నది.
ప్రభుత్వ భూసేకరణ చర్యలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా రోజుకో ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్నాయి. తమ జీవనోపాధి పోతుందని కొందరు, మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని మరికొందరు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం భూసేకరణలో నిర్వాసితులకు ఎకరాకు రూ.30 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)ను కోరింది.
రాష్ట్రంలో భూసేకరణకు గరిష్ఠంగా ఎన్టీపీసీ రూ.30 లక్షల చొప్పున చెల్లించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇదే విధంగా ట్రిపుల్ ఆర్ బాధితులకు చెల్లించాలని ప్రభుత్వం పేర్కొన్నది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే భూసేకరణకు సైతం రూ.30 లక్షల చొప్పున ధరను నిర్ధారించి చెల్లించాలని, డిమాండ్ ఉన్న చోట అంతకు పెంచి ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నది. రాష్ట్రంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అరకొర నష్ట పరిహారం చెల్లిస్తామంటే ఊరుకునేది లేదని బాధితులు స్పష్టంచేస్తున్నారు.