హైదరాబాద్, జూన్ 04 (నమస్తే తెలంగాణ): భూమిలేని ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా (ఐఏబీ) దక్కడంలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జనవరి 26న అట్టహాసంగా ప్రారంభించిన ఈ పథకం ముందుకు సాగడంలేదు. భూమిలేని రైతుకూలీలకు ఏడాదికి రెండు విడతల్లో రూ.12 వేలు అందిస్తామని సీఎం ఇచ్చిన హామీ అమలుకావడం లేదు. బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయించినప్పటికీ, ఇప్పటివరకు కేవలం 83,887 మందికి రూ.50.33 కోట్లు మాత్రమే అందించారు. ఇంకా ఐదు లక్షల మందికి రూ.300 కోట్లు అందాల్సి ఉన్నది. ఫైనాన్స్ టోకెన్లు జారీ అయినప్పటికీ కూలీల ఖాతాల్లో సొమ్ము మాత్రం జమ కావడం లేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయా? అని రైతు కూలీలు నిరీక్షిస్తున్నారు.
ప్రచారం ఘనం.. అమలు శూన్యం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థికభరోసా ఇస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పథకం అమలుకు అనేక ఆంక్షలు విధించింది. 2023-24లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కనీసం 20 రోజులు పనిచేసిన సొంత భూమిలేని కూలీలకు రూ.6 వేల చొప్పున రెండు దఫాల్లో ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ప్రకటించింది. దీనికి కూడా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి కాకుండా ఒక్కో జిల్లాలో, ఒక్కో మండలంలోని ఒక్క గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. జనవరి 26న ఆయా గ్రామాల్లోని 18,180 మందికి రూ.6 వేల ఆర్థికసాయం అందించారు. మరుసటి రోజు ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. ఆ తర్వాత మరో 63 వేల మందికి నగదు జమచేశారు. ఇప్పటివరకు కేవలం 83,887 మందికి రూ.50.33 కోట్లు మాత్రమే అందాయి.
6 లక్షల మందికి పైగా అర్హులు
ఎన్ఆర్ఈజీఏ ఎన్ఐసీ డాటా ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో 48,13,966 జాబ్‌కార్డులు ఉండగా, ఇందులో 93,61,614 మంది కూలీలు నమోదయ్యారు. ఉపాధి హామీలో 20 రోజులు పనిచేసినవారు 38,02,209 మంది ఉన్నారు. ఇందులో 20 రోజులు పనిచేసినవారిలో (సొంత భూమి ఉన్నవారు) రైతుభరోసా లబ్ధిదారులు 15,39,812 మంది ఉన్నారు. ప్రభుత్వం ఐఏబీ పథకం కింద 5,80,577 మంది అర్హులు ఉన్నట్టు గుర్తించి గ్రామాలవారీగా జాబితాలు విడుదల చేసింది. జాబితాల్లో పేర్లు లేని అర్హులైన కూలీలు దరఖాస్తు చేసుకోవచ్చని గ్రామసభల ద్వారా ఆహ్వానించింది. ఆ సభల్లో 2.24 లక్షల దరఖాస్తులు అందాయి. ఇందులో 19,193 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. 59,542 దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. మరో 1,44,784 దరఖాస్తులను తిరస్కరించారు. అనేక ఆంక్షలు, కోతలు విధించగా మొత్తం 5.80 లక్షల మందితోపాటు కొత్త దరఖాస్తుదారులు 20 వేల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే దాదాపుగా 6 లక్షల మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను వర్తింపజేయాల్సి ఉంటుందని చెప్తున్నారు.
ఆర్థిక భరోసా కోసం నిరీక్షణ
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి 6 లక్షల మందికిపైగా అర్హులు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. వీరందరికి ఆర్థిక భరోసా అందించాలంటే ఒక్కో విడతకు రూ.360 కోట్లు అవసరమవుతాయి. బడ్జెట్లో ఈ పథకానికి రూ.600 కోట్లు మాత్రమే కేటాయించింది. తొలివిడతలో ఇప్పటివరకు రూ.50.33 కోట్లు మాత్రమే అర్హులకు అందజేసింది. ఇంకా 5 లక్షలపైచిలుకు ఉపాధి కూలీలకు రూ.6000 చొప్పున అందించాల్సి ఉన్నది. ఈ మేరకు ఆర్థికశాఖకు ప్రతిపాదన అందగా ఫైనాన్స్ టోకెన్లు జారీచేసింది. ఇక బిల్లులు విడుదల కావడం, కూలీల ఖాతాల్లో సొమ్ము జమకావడమే మిలిగింది. కానీ నాలుగు నెలలుగా ఒక్క రూపాయి జమకాలేదు. వచ్చేనెల జూన్‌తో తొలివిడత ముగిసిపోనున్నది. ఇప్పుడే సమస్యలు ఎదురవగా, మలివిడత సమీపిస్తున్నా ప్రభుత్వం సమర్థంగా అమలు చేయలేకపోతున్నదని, ఆత్మీయ భరోసా ఆర్థికసాయం కోసం కూలీలు ఎదురుచూస్తున్నారు.