హైదరాబాద్,అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం నత్తను మరిపిస్తున్నది. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇంతవరకు మొదటి విడతలో ఇస్తామన్న ఇండ్లను కూడా పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. విడతలవారీగా 20 లక్షల ఇండ్లు నిర్మిస్తామన్న ప్రభుత్వం.. గత 20 నెలల్లో కనీసం 2 లక్షల ఇండ్లను కూడా నిర్మించలేకపోయింది. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 3,500 చొప్పున మొత్తం 4.5 లక్షల ఇండ్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం గత 20 నెలల్లో 2.15 లక్షల ఇండ్లు మాత్రమే మంజూరు చేసింది. వాటిలో 1.29 లక్షల ఇండ్లు మాత్రమే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో 8,633 ఇండ్లు మాత్రమే స్లాబ్ దశకు చేరుకున్నాయి. తొలి విడతలో ఇస్తామన్న 4.5 లక్షల ఇండ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు అవసరమవుతాయి. కానీ, ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం రూ.12 వేల కోట్లు మాత్రమే కేటాయించింది. అందులో ఇప్పటివరకు లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1,435 కోట్లు మాత్రమే జమ చేసింది.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతోపాటు వాటి లబ్ధిదారుల ఎంపికలోనూ ప్రభుత్వం తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు అనుసంధానంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుండడడంతో లబ్ధిదారుల వివరాలను కేంద్రం పేర్కొన్న ఫార్మాట్లో సమర్పించాల్సి ఉన్నది. కానీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫారసుల మేరకు అనర్హులతో లబ్ధిదారుల జాబితాను సిద్ధంచేసి కేంద్రానికి పంపడంతో చాలా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. అర్హులైన అనేక మందికి ఇండ్లు మంజూరు కాకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
ఆధార్ కార్డులోని వివరాల ఆధారంగా లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించడం సరికొత్త ఇబ్బందులకు తెరలేపింది. ఇండ్ల జాబితాలో ఉన్న పేర్లు, ఆధార్ కోర్డులోని పేర్లలో ఏ మాత్రం తేడా ఉన్నా సాయం అందడంలేదు. మరోవైపు లబ్ధిదారుల జాబితాను కేంద్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. ఈ సందర్భంగా చాలా మంది లబ్ధిదారులు బీపీఎల్ పరిధిలో లేరని తేలడంతో వారి పేర్లను తిరస్కరిస్తున్నది. అలా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపికచేసిన లబ్ధిదారుల్లో దాదాపు 20 వేల మందిని తిరస్కరించింది. వారిలో చాలా మంది ఇప్పటికే ఉంటున్న ఇండ్లను తొలగించుకుని కొత్త ఇంటి నిర్మాణం చేపట్టాక తమ పేర్లు తిరస్కరణకు గురైనట్టు తెలిసి లబోదిబోమంటున్నారు.