రాజన్న సిరిసిల్ల, జూలై 9(నమస్తే తెలంగా ణ) : కేసీఆర్ హయాంలో బతుకమ్మ చీరలు, ఇతర ప్రభుత్వ ఆర్డర్లతో కళకళలాడిన వస్త్రపరిశ్రమ, నేడు విలవిల్లాడుతున్నది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే సిరిసిల్ల నేతన్నపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. ఆర్డర్లన్నీ టెస్కో ద్వారా అందించి నేతన్నలకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, రెండున్నరేండ్లుగా గోసపెడుతున్నది.
కేవలం ఇందిర మహిళా శక్తి చీరల ఆర్డర్లు ఇచ్చి, ఇతర ప్రభుత్వ ఆర్డర్లను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ చేతులెత్తేస్తున్నది. ఇందిరమ్మ చీరల ఆర్డర్లు కూడా ఏడాదికి రెండుసార్లు ఇస్తామని ఇప్పటివరకు ఒక ఆర్డర్ మాత్రమే ఇచ్చింది. ఈ ఏడాది రెం డో విడతగా మరో చీర కోసం ఆర్డర్లు ఇచ్చినా.. కార్మికులకు చేతినిండా పనిదొరుకడం గగన మైంది. దీనికితోడు సిరిసిల్ల, నేతన్నలకు ఇవ్వాల్సిన రూ.250 కోట్ల బకాయిలను పెండింగ్‌లో పెడుతూ వారి సహనానికి పరీక్ష పెడుతున్నది. ఇటీవల సిరిసిల్లలో ఇందిరమ్మ చీరల కొనుగోలు ప్రక్రియ, త్రిఫ్ట్ పథకాన్ని ప్రారంభించిన చేనేత జౌళి శాఖ రాష్ట్ర డైరెక్టర్ శైలజరామయ్యర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రూ.250 కోట్ల బకాయిలకు గాను మొక్కుబడిగా రూ.12 కోట్లే విడుదల చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుం చి సిరిసిల్ల నేతన్నలపై కక్ష పూరితంగానే వ్యవహరిస్తున్నది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో కేసీఆర్ సర్కార్ హయాంలో ఇచ్చిన బతుకమ్మ చీరలు, ప్రభుత్వ ఆర్డర్లను నిలిపివేసింది. బకాయిలను కూడా పెండింగ్‌లో పెట్టింది. దీంతో వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకున్నది. సుమారు 15 మంది నేత కార్మికులు అర్థిక ఇబ్బందులు, సరైన ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నా రు. తప్పని పరిస్థితుల్లో ఒత్తిడితో ఏడాదిన్నర తర్వాత అరకొరగా ప్రభుత్వ ఆర్డర్లు, ఇందిర మహిళా శక్తి చీరల ఆర్డర్లు ఇచ్చింది. కానీ, బకాయిలను మాత్రం నిర్లక్ష్యం చేసింది.
రూ.300 కోట్ల విడుదల చేస్తున్నట్టు ప్రకటించి, తీరా 60 శాతమే చెల్లించి చేతులు దులుపుకొన్నది. ఇతర ప్రభుత్వ ఆర్డర్ల బకాయిలు చెల్లించలేదు. వస్ర్తాలను సేకరించిన బిల్లులు కూడా చెల్లించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఘోర పరాభవం చెందడంతో షాక్ తిన్న సర్కార్.. వస్త్ర పరిశ్రమను పట్టించుకోవడం లేదు. ఎన్నికల తర్వా త రూ.60 కోట్ల రంజాన్ తోఫాను టెండర్ల ద్వారా ప్రైవేట్‌కు అప్పగించింది.
అదేవిధంగా స్కూల్ యూనిఫారం ఆర్డర్లను సైతం ఇచ్చి నెల రోజుల తర్వాత రద్దు చేసింది. వస్ర్తాల సేకరణను టెండర్ల ద్వారానే తీసుకోవాలని జీవో నంబర్ 1కు విరుద్ధంగా టెండర్లకు పోయింది. ఈ విషయమై చేనేత సహకార సంఘాలు హైకోర్టును ఆశ్రయించగా, కాంగ్రెస్‌కు చెంపపెట్టు లాంటి తీర్పును ఇచ్చింది. ప్రభుత్వ ఆర్డర్లను టెస్కో ద్వారా వస్ర్తాల సేకరణ చేయాలని ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాలు పాటించకపోవడంపై నేతన్నలు మండిపడుతున్నారు.
నేతన్నలకు బకాయిలు చెల్లించాలన్న సో యి ఈ సర్కార్‌కు లేకుండా పోయింది. 2023లో కేసీఆర్ సర్కార్ ఇచ్చిన ప్రభుత్వ ఆర్డర్లకు బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్ తదితర ఆర్డర్లకు రూ.300 కోట్ల బకాయిలు చెల్లించామని ప్రగల్భాలు పలుకుతున్నది. వాస్తవానికి ఈ బకాయిలను ఈ జనవరిలోనే పూర్తిగా చెల్లిస్తామని సర్కార్ చెప్పింది. కానీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత బకాయిలను నిలిపివేసింది. అంతేగాక ఆర్డర్లను బంద్ చేసి ప్రైవేట్‌కు టెండర్లు పిలిచింది. ఇటీవలే మొక్కుబడిగా రెండో విడత ఇందిర మహిళా శక్తి చీ రల 3.06 కోట్ల మీటర్లు ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నది. మరోవైపు రూ.250 కోట్ల బకాయిలకు 12 కోట్లే ఇచ్చి చేతులెత్తేసింది.