చండ్రుగొండ, ఏప్రిల్ 24 : పేదలకు మంజూరు చేస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తున్న ఇందిరమ్మ ఇండ్లను అధికార పార్టీ నాయకులు పెద్దపెద్దోళ్లకు అమ్ముకుంటున్నారని భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం గుర్రంగూడెం గ్రామస్థులు ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు అడిగిన డబ్బులు ఇవ్వలేదని తమకు ఇండ్లు రాకుండా చేశారని భగ్గుమన్నారు. చివరికి జాబితాలో పేర్లు కూడా లేకుండా చేశారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం కాంగ్రెస్ నాయకులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ గుర్రంగూడెం వాసులు గురువారం గ్రామంలోని బొడ్రాయి సెంటర్ వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ.. తమ ఊరిలో 79 మందితో ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా తయారుచేశారని, వారిలో 18 మందికి ఇండ్లు మంజూరైనట్టు జాబితాను ప్రదర్శించినట్టు తెలిపారు. వీరిలో అనర్హులే అత్యధికంగా ఉన్నట్టు వారు పేర్కొన్నారు. రూ.50 వేలు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు వస్తుందంటూ కాంగ్రెస్ నాయకులు గోవిందరెడ్డి, శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేస్తున్నారని తెలిపారు. పేదలకు దక్కాల్సిన ఇండ్లను డబ్బులున్న వారికే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు రాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనకు దిగిన తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని వారితో చర్చించి రాస్తారోకో విరమింపజేశారు.
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అర్హులకు చోటుదక్కలేదనే విషయమై ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు గుర్రంగూడెంలో గురువారం విచారణ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి విచారణ జరిపారు. అనర్హులకు ఇస్తున్నారని, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ప్రత్యేకాధికారి ఎదుటే గ్రామస్థులతో అధికార పార్టీ నాయకు లు తీవ్ర వాగ్వాదానికి దిగారు. అక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణ నెలకొనడంతో సదరు అధికారి వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాను పరిశీలిస్తూ విచారణ చేస్తున్న సమయంలో గుర్రంగూడెంలో గొడవలు జరిగాయి. దీంతో విచారణ నిలిపివేశాం. గ్రామంలో గొడవలు సద్దుమణిగిన తరువాత అర్హుల జాబితా పరిశీలిస్తాం. డబ్బుల వసూలపై నాకు లిఖితపూర్వక ఫిర్యాదులు అందలేదు. ఫిర్యాదు వస్తే విచారణ చేస్తాం.
ఇందిరమ్మ ఇంటి కోసం రూ.50 వేలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నాయకులు శ్రీధర్‌రెడ్డి, గోవిందరెడ్డి డిమాండ్ చేశారు. నా దగ్గరలేవని చెప్పాను. దీంతో వారు నాకు ఇల్లు రాకుండా చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్లను అమ్ముకుంటున్నారు. పేదలకు ఇస్తామన్న ఇండ్లను డబ్బులిచ్చినోళ్లకు అమ్ముకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
ఇందిరమ్మ ఇండ్ల సర్వే చేసేటప్పుడు అర్హుల జాబితాలో నా పేరు ఉంది. కానీ ఫైనల్ జాబితాలో నాపేరు లేకుండా చేశారు. పెద్దపెద్దవాళ్లే ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేర్లను రాసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు శ్రీధర్‌రెడ్డి, గోవిందరెడ్డి డబ్బులు అడిగితే నేను ఇవ్వలేదు. అందుకే నాకు ఇల్లు రాకుండా చేశారు. నాకు ఇల్లు వచ్చేలా చేయండి సార్.
మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించేందుకు మా ఊర్లోని పెద్ద నాయకుడు వెంకటేశ్వర్లు రూ.60 వేలు లంచం అడిగాడు. ఇవ్వలేదని మాకు ఇల్లు రాకుండా చేశాడు. గ్రామంలో పేదలకు ఇండ్లు రాకుండా కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారు. అధికారులు ఇండ్లు ఎలా మంజూరు చేస్తున్నారో అర్థం కావడం లేదు.