మద్దూరు(ధూళిమిట్ట), అక్టోబర్ 4: ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా బిల్లులు రాకపోవడంతో ఓ లబ్ధిదారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్లలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన నారదాసు శ్రీకాంత్ (27) తండ్రి చిన్ననాడే చనిపోవడంతో తల్లి అంజమ్మతో కలిసి గ్రామంలో కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. శ్రీకాంత్‌కు పక్కా ఇల్లు లేకపోవడంతో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తొలివిడతలో మంజూరు కాకపోవడంతో రెండో విడతలోనైనా వస్తుందనే ఆశతో ఇంటి నిర్మాణాన్ని చేపట్టాడు.
ఇదే సమయంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి చొరవతో శ్రీకాంత్‌కు రెండో విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అప్పటికే నిర్మాణాన్ని చేపట్టడంతోపాటు నిబంధనల ప్రకారం కట్టలేదన్న కారణంతో అధికారులు బిల్లుల చెల్లింపునకు నిరాకరించారు. దీంతో చేసేదేమిలేక నిర్మాణాన్ని మధ్యలో ఆపలేక కొంత అప్పు చేసి స్లాబ్ లెవల్ వరకు పూర్తి చేశాడు.
మిగతా పనులకు బంధువులు, గ్రామస్థుల వద్ద అప్పు అడిగాడు. ఎవరూ ఇవ్వకపోవడంతో ఇంటి నిర్మాణాన్ని ఎలా పూర్తి చేయాలనే బెంగతో శుక్రవారం సాయంత్రం ఎలుకల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన తల్లి అంజమ్మ గ్రామస్థుల సాయంతో 108 అంబులెన్స్‌లో మొదట చేర్యాల సర్కార్ దవాఖానకు, అక్కడి నుంచి సిద్దిపేట సర్కార్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి రాత్రి మృతిచెందాడు. తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై షేక్ మహబూబ్ తెలిపారు.