Gummadidala | గుమ్మడిదల, మే 3 : పేదలకు సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది. అర్హులైన వారికి కాకుండా అధికార పార్టీ వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనాయని ఆరోపణలు వస్తున్నా ఆ ఇంటి నిర్మాణాలు బేస్మెంట్ స్థాయిలోనే ఉన్నాయి. ఫైలట్ గ్రామంగా ఎంపికైనా లబ్ధిదారులకు సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది. సీఎం రేవంత్రెడ్డి పాలనలో 40-60 గజాల ఇంటిస్థలంలోనే కట్టుకోవాలి.. ఆ ఇంటికి మెట్లు ఉండోద్దు.. రెండు గదులే ఉండాలి అని అధికారుల నిబంధనలను అనుసరించే ఇంటి నిర్మాణాలు నిర్మించుకోవాలని నింబధనలు పెట్టడంతో లబ్ధిధారులకు ఇబ్బందులు ఎదురైతున్నాయి.
గుమ్మడిదల మండలంలోని వీరన్నగూడెం ఫైలట్ గ్రామంగా ఎంపికైంది. జనవరి 26వ తేదీన గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేశారు. ఇందులో అర్హులైన పేదలకు తమకు ఇండ్లు లేవని దరఖాస్తు చేసుకోగా కేవలం 19 మందికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి. మిగిలిన వారికి రెండో విఢతలో వస్తాయని అధికారులు నమ్మబలికినా మొదటగా మంజూరైన లబ్ధిదారులకే పలు ఇబ్బందులు ఎదురైతున్నాయని వాపోతున్నారు. మంజూరైనవారిలో నలుగురు మాత్రమే ఇంటి నిర్మాణాలు చేస్తున్నారు. ఇందులో లబ్ధిదారు గాదే సుప్రియ మరో ముగ్గురు ఇంటి నిర్మాణాలు చేపట్టారు. ఈ లబ్ధిదారులు అప్పులు చేసి నిర్మాణాలు చేస్తున్నారు. వీరికి కూడాబిల్లులు రాక పోవడంతో బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. చేసిన అప్పులు మిత్తీలు పెరిగిపోతుండడంతో బిల్లులకు మోక్షం ఎప్పుడు కలుగుతోందని ఎదురు చూస్తున్నారు.
ఫైలట్ గ్రామంలో పూరిగుడిసెలో ఉన్న వారికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి సర్కారులో అసలైన అర్హులకు అందని ద్రాక్షగానే ఇందిరమ్మ ఇండ్లు మిగిలిపోయాయి. వీరన్నగూడెంలోని పూరిగూడిసేలో ఉంటున్న పొన్నబోయిన మంజుల ఆ గుడిసేలోనే బతుకును వెల్లదీస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ఆమెకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనకంటే పెంకుటింట్లో ఉన్న వారికి, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని తాను పూరిగుడిసెలో బతుకుతున్న తనకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని వాపోయారు. అధికారులను అడిగితే రెండోవిడతలో వస్తదని చెబుతున్నారని ఇంకెప్పుడు వస్తుందో అని ఇందిరమ్మ ఇంటి కోసం ఆమె ఎదురు చూస్తుంది. తనలాంటి వారికి సర్కారును నుంచి సాయమందిస్తే బాగుంటుందని ఆమె అన్నారు.