హైదరాబాద్, జనవరి 27(నమస్తే తెలంగాణ) : పట్టణ ప్రాంత పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం అందని ద్రాక్షగా మారుతున్నది. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లయినా ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నది. పేదల కోసం జీ+3 అపార్ట్మెంట్లు నిర్మించాలా? లేక ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలా? అనేదానిపై స్పష్టత లేకుండా పోయింది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 3.5 లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టింది. ఇంటి స్థలం ఉన్నవారికి రూ.5 లక్షల చొప్పున దశలవారీగా అందజేస్తున్నది. అయితే, పట్టణ ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వానికి దాదాపు 80 లక్షలకుపైగా దరఖాస్తులు అందగా, అందులో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన దరఖాస్తులు చెరిసగం ఉన్నాయి. 20 లక్షల ఇండ్లు నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వం మొదటి విడతలో 5 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటివరకు 3.6 లక్షల ఇండ్లు లబ్ధ్దిదారులకు మంజూరు చేయగా, ఇందులో చురుకుగా నిర్మాణాలు జరుగుతున్నవి 2.5 లక్షల వరకు ఉన్నాయి.
పట్టణ ప్రాంతాల్లో మాత్రం స్థలాల కొరతతోపాటు స్థలాలు ఉన్నవారికి సైతం చట్టపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంటి స్థలాలకు సంబంధించిన పత్రాలు సరిగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. ఎక్కువ శాతం ప్రభుత్వ స్థలాలు, రైల్వే, కంటోన్మెంట్, ఎయిర్పోర్ట్ అథారిటీ తదితర సంస్థల స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలు.. తమకు అదే ప్రాంతంలో ఇండ్లు ఇవ్వాలని కోరుతున్నారు. దీనికి చట్టపరమైన సమస్యలు ఉండటంతో ప్రభుత్వం ముందుకు కదల్లేకపోతున్నది. ప్రభుత్వం ప్రభుత్వ స్థలాల్లో జీ+3 పద్ధతిలో అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ, అక్కడ పేదలు గుడిసెలు ఖాళీ చేసేందుకు ఒప్పుకోవడంలేదు. ప్రభుత్వం ఇండ్లు నిర్మించేంతవరకు తాము అద్దె ఇండ్లలో ఉండాల్సివస్తుందని, అద్దెలు భరించే ఆర్థిక స్థోమత తమకు లేదని వాపోతున్నారు. అంతేకాదు, హైదరాబాద్‌లోని పలు బస్తీల్లో పేదలు నివసిస్తున్న బస్తీల స్థలాలపై కోర్టు కేసులున్నాయి. దీంతో నిర్మాణాలు చేపట్టే వీలు లేకుండా పోతున్నది.
ఇదిలావుంటే, పట్టణ పేదలకు 72 గజాల స్థలాలు ఇచ్చి అందులో ఇండ్లు నిర్మించి ఇస్తామని తాజాగా గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. స్థలాల కోసం సర్వే జరుగుతున్నదని చెప్పారు. అయితే, ఎక్కువగా పట్టణాలకు బహుదూరంలోనే ప్రభుత్వ స్థలాలున్నాయి. కాగా, పట్టణ పేదలు ఎక్కువగా తాము పనులు చేసుకునే ప్రాంతాలకు దగ్గర్లో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. గతంలో నగర శివార్లలో నిర్మించిన అపార్ట్మెంట్లు ఇంకా నిరుపయోగంగా ఉండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పట్టణాలకు దూరంగా ఇంటి స్థలం ఇచ్చి ఇండ్లు నిర్మించినా పెద్దగా ఫలితం ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ తదితర నగరాల్లో ప్రభుత్వ స్థలాలు నగరాలకు ఎంతో దూరంలో ఉన్నాయి. ప్రభుత్వం పట్టణాలకు దూరంగా నిర్మించే ఇండ్లకు తాము వెళ్తే ఉపాధికి దూరమవుతామని పేదలు అభిప్రాయపడుతున్నారు. తాము ఉంటున్న బస్తీల్లోనే ఎంత వీలైతే అంతమేరకు పక్కా గదులు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ, రాష్ట్ర ప్రభుత్వం పేదలు కోరుతున్న విధంగా గదులు నిర్మించాలనుకున్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ మార్గదర్శకాలకు విరుద్ధంగా చేపట్టే గృహాలకు నిధులు ఇచ్చే అవకాశం లేదు. పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వడం అంత శులభం కాదని, ఒకవేళ ప్రభుత్వం ఎంతో పట్టుదలతో వ్యవహరించినా ఏదో ఒక సమస్యతో నిర్మాణాలు చేపట్టే అవకాశం లేదని అధికారవర్గాలు చెప్తున్నాయి. దీంతో పట్టణ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందని ద్రాక్షగా మారే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.