హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, అందులో 1.29 లక్షల ఇండ్లు నిర్మాణంలో ఉన్నట్టు గృహనిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతం వెల్లడించారు. ఇందులో 20వేల ఇండ్లు గోడల వరకు నిర్మాణం కాగా, 8,633 ఇండ్లు స్లాబ్ వరకు వచ్చాయని ప్రకటనలో తెలిపారు. పలు ప్రాంతాల్లో పూర్తయిన ఇండ్ల గృహ ప్రవేశాలు జరుగుతున్నట్టు చెప్పారు. ఇండ్ల నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు లబ్ధిదారులకు రూ.1,435 కోట్లు అందించినట్టు పేర్కొన్నారు.
నిర్మాణ పురోగతి ఆధారంగా ప్రతి సోమవారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదును జమచేస్తున్నామన్నారు. తాజాగా సోమవారం 13,841 మంది లబ్ధిదారులకు రూ.146.30 కోట్లు విడుదల చేసినట్టు గౌతం వివరించారు. కాగా ప్రభుత్వం మొదటి దశలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం విదితమే. ఇందులో ఇప్పటివరకు కేవలం 1.29 లక్షల ఇండ్లు మాత్రమే పురోగతిలో ఉండడం గమనార్హం.