పెద్దపల్లి, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ) : కామారెడ్డి, నిర్మల్, మెదక్, సిద్దిపేట జిల్లాలు హాహాకారం చేస్తున్నాయి. వరద విలయంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఏ ముఖ్యమంత్రి అయినా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. వరదలో చిక్కుకున్న ప్రజానీకాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఆస్తి, ప్రాణనష్టం తగ్గించేందుకు దృష్టి సారించాలి. కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చర్చ జరుగుతున్నది. మూడు రోజులుగా వరద బీభత్సం సృష్టిస్తుంటే తాపీగా మూసీ సుందరీకరణ, ఇతర రాజకీయ అంశాలపై సమీక్షలు నిర్వహించిన సీఎం… అత్యవసరమైన వరద సమీక్షను మాత్రం పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గురువారం నామమాత్రంగా మంత్రి ఉత్తమ్‌తో కలిసి హెలికాప్టర్లో ఏరియల్ సర్వే కోసమంటూ వెళ్లారు. అక్కడికి వెళ్లి, వరద విధ్వంసం తగ్గించేందుకు తీసుకునే చర్యల గురించి మాట్లాడుతారని ఎవరైనా అనుకుంటారు. కానీ.. రేవంత్‌రెడ్డి బురద రాజకీయం చేశారని ప్రజానీకంలో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఎప్పుడూ రాజకీయాలే మాట్లాడితే.. పరిపాలన, విపత్తు నిర్వహణ, సహయ చర్యలపై అసలు ముఖ్యమంత్రికి అవగాహన ఉందా అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఉధృతిని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. గోలివాడ పంపు హౌస్‌లోని హెలీప్యాడ్‌లో దిగిన రేవంత్‌రెడ్డి.. రోడ్డు మార్గంలో ఎల్లంపల్లికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గోదావరి నీటిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ఆనాటి కాంగ్రెస్ ప్రభు త్వం ఎల్లంపల్లి ప్రాజెక్టును నిర్మించిందని తెలిపారు. ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. రూ.లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని, మేడిగడ్డ బరాజ్ కుంగిపోయిందని ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీళ్లు నింపితే పెద్ద ప్రమాదం సంభవిస్తుందని, ఊర్లకు ఊర్లే కొట్టుకుపోతాయని వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ బరాజ్‌లో నీటిని నింపితే కూలిపోయే ప్రమాదముందని, ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరుగుతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ, నిర్వహణ లోపాలు ఉన్నాయని జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదికలో తెలిపిందని చెప్పుకొచ్చారు. జస్టిస్ ఘోష్ కమిటీ, ఎన్డీఎస్ఏ నివేదికలపై అసెంబ్లీలో పూర్తిగా చర్చిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏరియల్ సర్వే చేసి, గమనించిన విషయాలపై మాట్లాడుతారని అనుకున్న ప్రజానీకం, మీడియా ప్రతినిధులు, అధికారులు… రేవంత్ తిట్ల పురాణం చూసి ఆశ్చర్యపోయారు.
వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.. ఊర్లకు ఊర్లు నీట మునిగిపోయాయి. కరెంటు సరఫరా, తిండి, నీళ్లు లేక ప్రజలు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. వరదలో చిక్కుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. కాపాడాలంటూ హాహాకారాలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వానికి ఇవేమీ పట్టడంలేదని, వరదలో చిక్కుకున్న ప్రజలకు భరోసా కల్పించాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి బురద రాజకీయంలో మునిగిపోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం నుంచి వర్షాలు బీభత్సం సృష్టిస్తుంటే.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జూమ్ మీటింగ్‌కు పరిమితమయ్యారు. హైదరాబాద్‌లోని ఇంట్లో కూర్చుని పత్రికలకు ప్రెస్నోట్లు పంపి, చేతులు దులుపుకున్నారు. ఇక రేవంత్‌రెడ్డి మాత్రం మూసీ సుందరీకరణ, రాజకీయ వ్యవహారాలపై చర్చలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో వరద బీభత్సం సృష్టిస్తున్నదని జాతీయ మీడియా సైతం కథనాలు ప్రసారం చేసింది. కానీ సీఎం నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. బుధవారం కామారెడ్డి పట్టణం అతలాకుతలమైతే.. తాపీగా సీఎంవో ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. కలెక్టర్లను అప్రమత్తం చేశారనేది ఆ ప్రకటన సారాంశం. ఇక అంతే.. ఆ తర్వాత సీఎం మర్చిపోయారు. ఇక్కడ కూడా ప్రభుత్వంలోని ఆదిపత్య ధోరణి, గ్రూపు రాజకీయాలు కనిపించాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చూసుకుంటారులే… నాకెందుకు అన్నట్టుగా రేవంత్‌రెడ్డి వ్యవహరించారని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాలు అస్తవ్యస్తమయ్యాయి. ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులైన సీతక్క, వివేక్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదు. మెదక్ సొంత జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ కూడాఅదే విధంగా వ్యవహరించారు. హైదరాబాద్‌లోనే ఉండి పత్రికా ప్రకటనలు విడుదల చేశారు. సీఎం ఏమైపోయారంటూ విమర్శలు వ్యక్తమవుతుండడంతో తప్పని పరిస్థితుల్లో ఏరియల్ సర్వే చేసినట్టు కనిపిస్తున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు ఉదయం స్పోర్ట్ హబ్బోర్డు సమీక్ష, ఒలంపిక్స్‌లో తెలంగాణకు ప్రాతినిథ్యంపై చర్చించారు. ప్రజలు వర్షాలతో అతలాకుతలమైతుంటే.. క్రీడలపై సమీక్ష ఏంటని విపక్షాల నేతలు మండిపడుతున్నారు. ఆటలపై సమీక్షకు ఇదేనా సమయం అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా రాజాంపేట్ మండలంలో కొండాపూర్, అరగొండ, ఎల్లాపూర్‌తండా, ఎల్లారెడ్డిపల్లి, గుడితండా గ్రామాలు జలమయ్యాయి. అక్కడి ప్రజలు ప్రాణాలు చేతపట్టుకొని సాయం కోసం ప్రభుత్వంపై ఆశగా చూశారు. ఇండ్ల్లలోకి నీళ్లు రావడంతో పైకప్పు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. భారీ వర్షాలతో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. కరెంట్ లేదు, తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, ఉండడానికి నివాసం లేదు. పిల్లలు, పెద్దలంతా ఆకలితో అలమటించారు. అయినప్పటికీ వారికి బుక్కెడు బువ్వపెట్టే నాథులే కరువయ్యారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో జిల్లా అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో నష్టం భారీ స్థాయికి చేరింది. ఇలా వరద ప్రాంతాల ప్రజల గోస వర్ణణాతీతం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సాయం అందించడంలో సర్కారు, అధికారులు ఘోరంగా విఫలమయ్యారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో పునరావాస చర్యలు కల్పించడంలోనూ అధికారులు విఫలమైనట్టు విపక్షాల నేతలు మండిపడుతున్నారు.